బాబుతో కలిశాక మోడీ జీరో
మోడీ ముసుగులో చంద్రబాబు కుట్రలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిశాక బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జీరో అయ్యారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన రోజు భారతమాత కన్నీళ్లు పెట్టుకుందని వ్యాఖ్యానించిన మోడీ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయారన్నారు. ‘చంద్రబాబు ఆంధ్రా బాబు. మోడీ ముసుగులో తెలంగాణలో కుట్రలు పన్నుతున్నాడు. బాబును వెంటేసుకొని మోడీ బొడ్లో కత్తిపెట్టుకొని వస్తున్నాడు’ అని టీఆర్‌ఎస్ అధినేత ధ్వజమెత్తారు. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారంటూ తెలంగాణ ఏర్పాటుపై మోడీ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మోడీని చూసి పొరపాటున బీజేపీకి ఓటేస్తే టీడీపీకి వేసినట్లేనన్నారు. ఇక తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ అనడం పెద్ద జోక్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన రాష్ర్టంలో మన జెండానే ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు.
కరీంగనర్ జిల్లా సిరిసిల్ల, మెదక్ జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటల్లో, వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ కేంద్రాల్లో, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరిలలో నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. తమది సెక్యులర్ పార్టీ అని, బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు అండగా ఉంటామని భరోసానిచ్చిన కేసీఆర్.. పార్టీ మేనిఫెస్టోలోని హామీలను గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణకు స్వీయ నాయకత్వం కావాలని, అందుకు టీఆర్‌ఎస్‌నే ఆదరించాలని కోరారు.
పొన్నాల.. దళితుల భూములు తిరిగివ్వు
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై కేసీఆర్ ధ్వజమెత్తారు. పొన్నాలకు సిగ్గూ, లజ్జ ఉంటే.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని రాంపూర్ వద్ద ఆక్రమించిన భూమిని దళితులకు తిరిగివ్వాలన్నారు. అక్కడి 9 ఎకరాలను పొన్నాల కబ్జా చేశారని ఆరోపించారు. తాము ధర్నాలు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పుడు తెలియక కొన్నానని పొన్నాల పిట్టకథలు చెబుతున్నాడని, ఆయనేమైనా పాలు తాగే పిల్లాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తామే ఇచ్చామంటున్న కాంగ్రెస్ నాయకులు ఏనాడైనా ఉద్యమం చేశారా? జైలుకెళ్లారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సన్నాసుల పిచ్చి కూతలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. తెలంగాణ తెచ్చిన కీర్తి తనకు చాలన్నారు. అయితే సాధించుకున్న తెలంగాణను అసమర్థులు, దొంగలు, దెయ్యాల చేతిలో పెట్టొద్దనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.
మొదటి సంతకం తండాలపైనే
తమిళనాడు తరహాలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, వక్ఫ్ ఆస్తులను కబ్జాల నుంచి విడిపించి.. వక్ఫ్ బోర్డుకు న్యాయాధికారాలను ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌తో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే జీవో ఇస్తామని చెప్పారు. ఈ ఫైల్‌పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేస్తానన్నారు. నేత కార్మికుల వ్యక్తిగత రుణాలను, ప్రైవేటు అప్పులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చారు. బ్యాంకు అప్పులపై మారటోరియం విధిస్తామని, సిరిసిల్ల ప్రాంతం సస్యశామలమవుతుందని, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తామని, బీడీ కార్మికులకు ఇప్పుడొచ్చే పింఛన్‌కు తోడు అదనంగా రూ. వెయ్యి భృతిని అందిస్తామని హామీలిచ్చారు. జూన్ 2 తర్వాత కచ్చితంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే లక్ష రూపాయల మేర వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, రైతులు ఉపయోగించుకుంటున్న ట్రాక్టర్లు, ట్రాలీలపై రవాణా పన్నులు తొలగిస్తామని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేకుండా రూ. 10 లక్షల వరకు రుణాలిస్తామని, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని పునరుద్ఘాటించారు. కరెంటు విషయంలో తొలుత కొంత ఇబ్బంది తప్పదని, మూడేళ్లలోగా ఉత్పత్తిని పెంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. నిపుణులతో చర్చించాకే మేనిఫెస్టో రూపొందించామన్నారు. దీన్ని అమలు చేసి ప్రజల సంక్షేమానికి పాటుపడతామన్నారు.
ధరల సంగతేంది?: కేసీఆర్‌ను ప్రశ్నించిన మహిళ
‘సార్ మీరు చెప్పేది బాగానే ఉంది గానీ ఉప్పు, పప్పు, నూనెలు, కూరగాయల ధరల సంగతేంది? జర వాటి గురించి ఆలోచించండి’ అని వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ సభలో కేసీఆర్‌ను ఓ మహిళ ప్రశ్నించింది. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని హామీలను కేసీఆర్ వల్లెవేస్తుండగా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లికి చెందిన రాజమ్మ లేచి నిత్యావసర వస్తువుల విషయాన్ని ప్రస్తావించింది. రూపాయికి కిలో బియ్యమిస్తూ మిగిలిన సరుకుల రేట్లు మాత్రం పెంచుతున్నారని పేర్కొంది. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ఆమెకు సమాధానమిచ్చారు. ఆమె అడిగిన ప్రశ్నలో న్యాయముందని, మేనిఫెస్టోలో నిత్యావసర వస్తువుల ధరల విషయం పెట్టలేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యమిస్తూ ఇతర వస్తువుల ధరలు ఇష్టారాజ్యంగా పెంచిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మంత్రి
జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి గీతారెడ్డిని ఫైవ్‌స్టార్ మంత్రిగా కేసీఆర్ అభివర్ణించారు. ఆమె ఎవరినీ కలవరని, సమస్యలు పట్టించుకోరని విమర్శించారు. ఆమెపై సీబీఐ కేసుందని గుర్తుచేస్తూ.. ఆమెను గెలిపించినా ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఆమె జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కాగా, జోగిపేటలో జరిగిన సభలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. దామోదర ప్రతి రోజూ కేసీఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నా.. కేసీఆర్ మాత్రం పల్లెత్తుమాట అనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.