మోడీకి.. స్క్రూ లూజా?
ఎవరినైనా ఏకీపారేయడంలో గులాబీ బాస్ స్టయిలే సపరేటు. మామూలుగానే ఆయన మాటలకు పదునెక్కువ. సార్వత్రిక ఎన్నికల సమరం నేపథ్యంలో మాటలను తూటాల్లా పేలుస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. విమర్శల వాడి పెంచారు. ఆరోపణల అస్త్రాలను ప్రత్యర్థులపై సూటిగా సంధిస్తున్నారు. తిట్ల దాడి ఉధృతం చేశారు. అటు మోడీని, ఇటు చంద్రబాబును చెడుగుడు ఆడేస్తున్నారు ఉద్యమ పార్టీ నేత. కొత్తగా సొంత కుంపటి పెట్టి సినీ నటుడు పవన్ కళ్యాణ్నూ కేజీఆర్ వదిలిపెట్టడం లేదు.
నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో జరిగిన సభల్లో బాబు, మోడీ, పవన్లపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు బద్ద శత్రువైన మోడీ చంకలో చంద్రబాబు, పవన్ దూరారని దుయ్యబట్టారు. ఇద్దరు ఆంధ్రావాళ్లను పక్కనపెట్టుకుని మోడీ చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. మోడీ.. నీకేమైనా స్క్రూ లూజాయిందా అంటూ ప్రశ్నించారు. ఇలాగే మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మోడీ తెలంగాణ దుష్మన్ అంటూ విరుచుకుపడ్డారు.
మోడీ ముసుగేసుకుని తెలంగాణలో తిరుగుతున్న చంద్రబాబు బండారం బయటపెడాతనని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. లంగాణ ఏర్పాటును చివరి వరకు అడ్డుకున్న నీచుడు చంద్రబాబు.. బీజేపీకి వేసే ప్రతి ఓటు చంద్రబాబుకే పడుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నిజాం షుగర్స్ అమ్ముకున్న చంద్రబాబును జైలు ఊచలు లెక్కిపెట్టిస్తానని శపథం చేశారు. తాను తలచుకుంటే హైదరాబాద్లో చంద్రబాబు ఇంటి నుంచి కాలు బయటపెట్టలేరని అన్నారు. అటు చంద్రబాబు కూడా కేసీఆర్ విమర్శలకు, తిట్లకు దీటుగానే స్పందిస్తున్నారు.