కేసీఆర్ మంత్రివర్గమా.. ఫ్యామిలీ ప్యాకేజా..?
టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రివర్గాన్ని సొంత ఆస్తి పంచుకున్నట్లు ఏర్పాటు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. 25 శాతం మంత్రి పదవులు తన బంధువులకే ఇచ్చి, మంత్రివర్గాన్ని ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేశారన్నా రు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు గానీ, గిరిజనుడికి గానీ స్థానం కల్పిం చలేదన్నారు. ఏ సభ లోనూ సభ్యుడు కాని నాయిని నర్సింహారెడ్డికి హోం మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల ఉనికి కనిపించకుం డా చేయాలనేది కేసీఆర్ ప్రయత్నమన్నారు.
అందుకే తెలంగాణ లోగోలో కూడా అమరవీరుల స్తూపానికి స్థానం ఇవ్వలేదని విమర్శించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటును గెలిపించిన పాలమూరుకు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ ద్రోహం చేశారన్నారు. మంత్రివర్గంలో పాలమూరుకు అవకాశం ఇవ్వకపోతే కేసీఆర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్ లకు మంత్రి పదవులు ఇస్తే బాగుండేదన్నారు.