సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌తో టీటీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. నమ్మకద్రోహానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కేసీఆర్ తో కలసి పనిచేస్తామంటే తనను ఇంట్లోకి కూడా రానివ్వరని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల విశ్వాసానికి కోదండరాం ప్రతీక అయితే.. విశ్వాస ఘాతుకానికి కేసీఆర్ ప్రతిరూపమని విమర్శించారు. కేసీఆర్ టీడీపీ టికెట్ కోసం అజయ్‌గా ఉన్న తన కుమారుడి పేరును ఎన్టీఆర్ కాళ్ల దగ్గరపెట్టి తారక రామారావుగా మార్చాడని ఆరోపించారు. టీడీపీ టికెట్ కోసం, పదవుల కోసం కన్నకొడుకు పేరుమార్చిన సన్నాసి కేసీఆర్ అని విమర్శించారు.
పరిటాల రవితో కలసి కేసీఆర్ ఏనాడూ కేబినెట్‌లో పనిచేయలేదన్నారు. కోదండరాంను విమర్శించేంత అహంకారం కేసీఆర్‌కు ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ కూడా సర్పంచు కాలేదని.. మరి దేశానికి మహాత్ముడు కాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను తిట్టడం ద్వారా ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నా రు. కేసీఆర్ అంబానీలు, ఆదానీలకు బొగ్గు గనులను అమ్ముకుంటున్నారని.. తాడిచెర్ల బొగ్గు గని అమ్మకానికి అడ్డుపడుతున్నందుకే కోదండరాంపై కేసీఆర్ మండిపడుతున్నారన్నారు. తాము దొర అనేది కేసీఆర్ కులాన్ని బట్టి కాదని.. సామాన్య ప్రజలను దోచుకుంటున్నందుకే దొర అంటున్నామని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment