రైల్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడం నా గోల్...
‘రైల్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడం నా గోల్. లక్నోలో ఆగి బాటిల్‌లో నీళ్లు నింపుకొన్నా. అట్లా అని లక్నో నాదయితదా? నాది హైదరాబాదే. వెళ్లాల్సింది ఢిల్లీకే..’.. తన రాజకీయ జీవితం గురించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన ఆసక్తికర వ్యాఖ్య ఇది. శాసనసభలో డీఎల్‌ఎఫ్ భూముల కేటాయింపుపై సీఎం కేసీఆర్ పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సభ వాయిదా పడిన అనంతరం టీడీఎల్పీ చాంబర్‌లో కూర్చొన్న రేవంత్‌ను విలేకరులు పలకరించారు.
‘మీ రాజకీయ ప్రస్థానం కూడా టీఆర్‌ఎస్ నుంచే కదా?’ అని ఆయనను ప్రశ్నించగా... ‘నో..నో.. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వాడిని. ఎమ్మెల్యే కావడం నా టార్గెట్. ఢిల్లీకి వెళుతుంటే మధ్యలో లక్నో తగిలినట్లు ఆ పార్టీలో కొద్దిరోజులున్నా. నీళ్లు నింపుకొని మళ్లీ రెలైక్కా. టీడీపీ నుంచి ఎమ్మెల్యేనైనా..’ అని నవ్వుతూ చెప్పారు. రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ కాకముందు కొద్దిరోజులు టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగారు. జెడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి టీడీపీ మద్దతుతో గెలిచి.. ఆ తరువాత టీడీపీలో చేరారు.