గ్రామాలకు ప్రభుత్వం సరఫరా చేసిన నీటి పరీక్ష కిట్లు చాలా చోట్ల వినియోగించడంలేదు. దీంతో సర్కార్ లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కిట్లు చాలావరకు మూలన చేరాయి. చేవెళ్ల గ్రామీణ నీటి సరఫరా సబ్ డివిజన్ పరిధిలో చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్, మొయినాబాద్, నవాబుపేట మండలాల పరిధిలో 126 గ్రామ పంచాయతీలు, వాటికి అనుబంధంగా 124 గ్రామాలున్నాయి. మొత్తమ్మీద 1560 చేతి పంపులుండగా, వాటిలో 80 వరకు పనిచేయటం లేదు. 269 చేతి పంపులు కే వలం వర్షాకాలంలోనే పనిచేస్తాయి. 203 ఓహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంకులు, 36 మినీ ట్యాంకులు, 106 సంపులున్నాయి.
నియోజకవర్గంలో సుమారుగా రెండున్నర లక్షల జనాభా ఉంది. శంకర్‌పల్లి మండలంలో మాత్రమే మంజీరా జలాలను అందిస్తుండగా, విగిలిన మండలాల్లో బోరు బావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో సరఫరా చేసే నీటిని ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు వీలుగా అన్ని గ్రామాలకు ప్రభుత్వం నీటి పరీక్ష కిట్లను పంపిణీ చేసింది. నీటి పరీక్షలు ఎలా చేయాలన్నదానిపై అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి పరీక్షలు ప్రహసనంగా మారాయి. నీటి శుద్ధత కిట్లను పంపిణీ చేసిన అధికారులు వాటిని గ్రామాల్లో సక్రమంగా వినియోగిస్తున్నారా.. లేదా.. అనే అంశాలపై పర్యవేక్షించకపోవడం మూలంగా చాలా గ్రామాల్లో నిరుపయోగంగా పడిఉన్నాయి.
నెలకోసారి పరీక్ష చేయాలి..
జనాభా ఆధారంగా ప్రతి 500 మందికి నీరు అందించే వనరులను గుర్తించి వాటి నుంచి కనీసం నెలకోసారి నీటిని సేకరించి పరీక్ష చేయాలి. చేతి పంపుల నీటిని నెలకోసారి, బావుల్లోని నీటిని నెలకు రెండు సార్లు, కుళాయి నుంచి సరఫరా చేసే నీటిని నెలకు రెండు సార్లు, అంతర్గత క్లోరిన్ పరీక్ష నెలకోసారి చేయాలి. వర్షాకాలానికి ముందు, తర్వాత రసాయన పరీక్ష నిర్వహించాలి. నీటి నాణ్యతా కిట్ల సాయంతో నాణ్యత పర్యవేక్షణ, పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నీటి వనరుల వద్దే పరీక్షలు నిర్వహించాలి. విశ్లేషణ ఫలితాలను నిర్ణీత పట్టికలో నింపి ప్రతినెలా జిల్లా, డివిజన్ స్థాయి ప్రయోగశాలలకు పంపించాలి. క్షేత్రస్థాయిలో కిట్లతో నీటి నమూనాలను రసాయనిక, బ్యాక్టీరియాలాజికల్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంది.
గ్రామస్థాయిలో నాణ్యతను తెలుసుకోవడానికి సాధారణ పరీక్షలు సరిపోతాయి. నీటి పరీక్షల్లో ఫ్లోరైడ్‌శాతం, కలుషిత నీటి శాతం, బ్యాక్టీరియా శాతం లాంటి నమూనాలు బయటపడితే నివారణ చర్యలను తీసుకోవచ్చనేది పరీక్షల ప్రధాన ఉద్ధేశం. దీనికి ప్రభుత్వం సరఫరా చేసిన కిట్లను వినియోగిస్తే చాలు. కాగా అధికారులెవరూ పట్టించుకోకపోవడం మూలంగా ఈ విధానం సత్ఫలితాలనివ్వడంలేదు. దీంతో ప్రజాధనం వృథా అవుతోందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి నాణ్యతా పరీక్షలను నిర్వహించి, రక్షిత మంచినీటిని అందించాలని కోరుతున్నారు. వర్షాకాలం త్వరలో ప్రారంభమవుతున్నందున నీటి నాణ్యతా పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తే కలుషిత నీటి నుంచి ప్రజలను కాపాడవచ్చంటున్నారు.
మంచినీటికి ‘పరీక్ష’
Published Thu, May 29 2014 11:11 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement