
ప్రాణభయం ఉంది.. ఇంటికి పంపించండి
నేరెళ్ల బాధితుల వేడుకోలు
వేములవాడ: ‘ఏ పాపమూ ఎరగని మమ్మల్ని పోలీసులు అకారణంగా అరెస్టు చేసి.. కేసులు పెట్టి.. చిత్రహింసలకు గురి చేశారు. ఏ పనీ చేసుకోకుండా చేసి.. జైలుకు పంపారు. ఇప్పుడు షరతుల పేరుతో వేములవాడకే పరిమితం చేశారు. ఇక్కడ మాకు ప్రాణహాని ఉంది. మమ్మల్ని జైలులోనైనా ఉంచండి.. లేకుంటే మా ఇళ్లకైనా పంపండి..’అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బాధితులు వేడుకున్నారు.
బెయిల్‌పై విడుదలై వేములవాడలో ఉన్న నిందితులు పెంట బానయ్య, కోల హరీశ్, చిట్యాల బాలరాజు, బత్తుల మహేశ్, పసుల ఈశ్వర్‌కుమార్, గందం గోపాల్ గురువారం విలేకరులతో మాట్లాడారు. కాయకష్టం చేసుకునే తమకు ఇప్పటికే నరకం చూపించారని, ఇప్పుడు వేములవాడలో ఉంచి ఏం చేస్తారోనని భయపడుతున్నామన్నారు. చిత్రహింసలకు గురిచేసిన ఎస్పీ, సీసీఎస్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకులు అండగా నిలిచి తమను రక్షించారని చెప్పారు. కాగా, వారిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్, ఇతర నాయకులు స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితులను గురువారం మానవ హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, దళిత లిబరేషనర్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ పరామర్శించారు.