ఒకేచోట గాయాలెలా అయ్యాయి?
సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామాల్లోని దళితులపై పోలీసులు దాడి చేసిన ఘటనపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని, లేనిపక్షంలో ప్రత్యేక బృందానికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతోపాటు, ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించి రెంటింటినీ హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. బాధితులకు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసి ఇచ్చిన నివేదికకూ, జైలు వైద్య అధికారుల వైద్య నివేదికకూ వ్యత్యాసం ఎందుకు ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
రెండు నివేదికలనూ బేరీజు వేస్తూ ఒక పట్టిక రూపంలో నివేదిక అందించాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డిని ఆదేశించింది. రెండు వైద్య నివేదికల్లో తేడాలున్న మాట వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. కేసు దర్యాప్తు పేరుతో బాధితులపై ఒక ఎస్సై అతిగా స్పందించారని, పరిధి దాటి కొట్టారని, అందుకే ఆ ఎస్సైని సస్పెండ్ చేశామని ఏజీ వివరణ ఇచ్చారు. తొలుత లాఠీచార్జి వల్ల బాధితులకు గాయాలయ్యాయని అనుకున్నామని, తర్వాత ఎస్సై కారణమని తేలిందని చెప్పారు. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.