nerella victims
-
నేరెళ్ల బాధితులకు వైద్యం అందించండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో గాయపడిన సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితుల్లో ఇద్దరికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యసాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నేరెళ్ల, జిల్లెల, రామచంద్రా పురం గ్రామాల దళితులపై పోలీసులు జరిపిన దాడిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతత్వం లోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరి పింది. అనంతరం బాధితుల్లో ఎంత మందికి వైద్య సాయం అవసరమని పిటిషనర్ న్యాయవాది రఘునాథ్‌ని అడగ్గా, ఇద్దరికి అవసరమని ఆయన చెప్పారు. వారికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యసాయం అందిస్తామని ఏజీ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. -
‘నేరెళ్ల’ బాధితులను పంపేసిన నిమ్స్ వైద్యులు
-
‘నేరెళ్ల’ బాధితులను పంపేసిన నిమ్స్ వైద్యులు
♦ బలవంతంగా వెళ్లగొట్టారంటూ బాధితుల ఆందోళన ♦మద్దతుగా నిమ్స్ వద్ద కాంగ్రెస్, ప్రజాసంఘాల నేతల ధర్నా హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘నేరెళ్ల’బాధితులను ఆస్పత్రి సిబ్బంది గురువారం రాత్రి డిశ్చార్జి చేసి, బయటకు పంపించారు. తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స కొనసాగించాలని కోరినా బలవంతంగా బయటకు పంపేశారంటూ ఈ సందర్భంగా బాధితులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ప్రజా సంఘాల నేతలు గజ్జెల కాంతం, అనిల్‌కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. చివరికి బాధితులను తీసుకెళ్లి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. వెళ్లిపోవాలని బెదిరించారు..! ‘నేరెళ్ల’ఘటనలో తీవ్రంగా గాయపడిన బానయ్య, గోపాల్, హరీశ్, ఈశ్వర్, బాలరాజు, మహేశ్ అనే ఆరుగురిని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అఖిలపక్షం నేతలు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వారికి తగిన చికిత్స అందజేయాలని వైద్య సిబ్బందికి సూచించి డబ్బు కూడా కట్టారు. అయితే బుధవారం నుంచి చికిత్స అందజేసిన వైద్యులు గురువారం రాత్రి వారిని డిశ్చార్జి చేశారు. కానీ తమకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స కొనసాగించాలంటూ నేరెళ్ల బాధితులు ఆందోళనకు దిగారు. తమకు పైనుంచి తీవ్ర ఒత్తిడులు వస్తున్నాయని, వెళ్లిపోవాలని గురువారం మధ్యాహ్నం నుంచే ఆస్పత్రి సిబ్బంది ఒత్తిడి చేశారని వారు పేర్కొన్నారు. పోలీసులు కూడా మఫ్టీలో వచ్చి తమ వివరాలను, ఫొటోలను తీసుకుని వెళ్లారని... పంజాగుట్ట సీఐ పోలీసు సిబ్బందితో వచ్చి వెంటనే ఆసుపత్రి విడిచి వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారని ఆరోపించారు. చివరికి ఆసుపత్రి సిబ్బంది తమకు ఎక్కిస్తున్న సెలైన్లను కూడా తొలగించి బయటికి పంపించారని చెప్పారు. బాధితులను నిమ్స్ నుంచి పంపేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలు గురువారం రాత్రి నిమ్స్ వద్దకు చేరుకుని బైఠాయించారు. -
ఒకేచోట గాయాలెలా అయ్యాయి?
- రహస్య ప్రదేశాలు ఎందుకు కమిలిపోయాయి? - రెండు వైద్య నివేదికల్లో తేడాలు ఎందుకున్నాయి? - నేరెళ్ల బాధితులపై టీసర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల బాధితులందరికీ రహస్య ప్రదేశాల్లోనే ఎందుకు గాయాలయ్యాయి..? వారి మర్మాంగాలు కమిలిపోవడానికి కారణం ఏమిటి..? బాధితులందరికీ ఒకే తరహాలో గాయాలు ఎలా అవుతాయి..? రెండు వైద్య నివేదికల్లో తేడాలు ఎందుకు ఉన్నాయి..? అని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైద్య నివేదికల్లో వ్యత్యాసాలపై పట్టిక రూపంలో సమగ్ర వివరణ ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామాల్లోని దళితులపై పోలీసులు దాడి చేసిన ఘటనపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని, లేనిపక్షంలో ప్రత్యేక బృందానికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతోపాటు, ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించి రెంటింటినీ హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. బాధితులకు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసి ఇచ్చిన నివేదికకూ, జైలు వైద్య అధికారుల వైద్య నివేదికకూ వ్యత్యాసం ఎందుకు ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. రెండు నివేదికలనూ బేరీజు వేస్తూ ఒక పట్టిక రూపంలో నివేదిక అందించాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డిని ఆదేశించింది. రెండు వైద్య నివేదికల్లో తేడాలున్న మాట వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. కేసు దర్యాప్తు పేరుతో బాధితులపై ఒక ఎస్సై అతిగా స్పందించారని, పరిధి దాటి కొట్టారని, అందుకే ఆ ఎస్సైని సస్పెండ్ చేశామని ఏజీ వివరణ ఇచ్చారు. తొలుత లాఠీచార్జి వల్ల బాధితులకు గాయాలయ్యాయని అనుకున్నామని, తర్వాత ఎస్సై కారణమని తేలిందని చెప్పారు. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలి
నిజనిర్ధారణ కమిటీ నాయకులు వేములవాడ: కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తేనే నేరెళ్ల బాధితులకు న్యాయం జరుగుతుందని కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి బి.అభినవ్ అన్నారు. వేములవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘నేరెళ్ల’ బాధితులు పెంట బానయ్య, కోల హరీశ్, చిట్యాల బాలరాజు, బత్తుల మహేశ్, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్‌ను శనివారం వారు పరామర్శించారు. నేరెళ్లలో జరిగిన ఘటన, తర్వాతి పరిణామాలు చూస్తుంటే కులం, పేదరికం కోణాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయన్నారు. ఇసుక మాఫియాతో చేతులు కలిపిన ప్రభుత్వం నేరెళ్ల బాధితులను ఆదుకు నేందుకు ముందుకు రావడంలేదని విమర్శిం చారు. అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులపై కండిషన్ బెయిల్ ఎత్తివేసి మెరుగైన వైద్యం కోసం హైద రాబాద్ తరలించాలని వారు డిమాండ్ చేశారు. -
నేరెళ్ల బాధితుల వద్దకు డాక్టర్లను పంపండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల బాధితుల వద్దకు వరంగల్ ఎంజీఎంకు చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రా పురం గ్రామాలకు చెందిన ఆరుగురు బాధితు లను పరీక్షించి, వారి ఒంటిపై ఉన్న గాయాలు, వాటి తీవ్రత తెలుసుకోవాలని స్పష్టం చేసింది. ఆ వివరాలను రాతపూర్వకంగా నివేదిక రూపంలో నమోదు చేయాలని స్పష్టం చేసింది. బాధితులకు మరింత మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్య దర్శిని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు, డాక్టర్ల నివేదిక తమ ముందుం చాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితులపై పోలీసులు జరిపిన దాడిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ ప్రారంభించింది. లారీల వల్ల స్థానికులు చనిపోతున్నారు తంగళ్లపల్లి వాగు నుంచి ఇసుక తీసుకుని నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం మీదుగా రాత్రీపగలు ప్రతీరోజూ 150–200 లారీలు వెళుతున్నాయని విచారణ సందర్భంగా రఘునాథ్ చెప్పారు. దీనివల్ల ఆ గ్రామాల్లో తీవ్ర వాయు కాలుష్యంతోపాటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల మరణాలు కూడా చోటుచేసుకున్నాయని వివరించారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఈ మూడు గ్రామాల ప్రజలు అధికారులను కోరినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. పోలీసుల దెబ్బలకు బాధితుల అవయవాలు దెబ్బతిన్నాయని, వారికి తక్షణమే మెరుగైన వైద్యసాయం అందకుంటే శాశ్వతంగా ఆ అవయవాలు పనిచేయకుండా పోతాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎంజీఎంలో చికిత్సనందిస్తాం: ఏజీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపి స్తూ.. గతనెల 13న పీయూసీఎల్ నిజ నిర్ధారణ కమిటీ సంబంధిత గ్రామాలకు వెళ్లిందని, పిటి షన్ మాత్రం ఇప్పుడు దాఖలు చేశారన్నారు. పిటిషనర్ ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారికి చికిత్సను అందజే స్తామన్నారు. అయితే అంతకన్నా ముందు ఇద్దరు ఎంజీఎం వైద్యులను బాధితులు చికిత్స పొందుతున్న మనోరమ ఆసుపత్రికి పంపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదే శించింది. ఈ సమయంలో రఘునాథ్ జోక్యం చేసుకుంటూ.. డాక్టర్లతో పాటు ఫోరెన్సిక్ వైద్యులను పంపాలని కోరారు. ముందు బాధి తులకు చికిత్స అందించడానికి ప్రాధాన్యం ఇద్దామని, అవసరమైతే ఫోరెన్సిక్ డాక్టర్లను పంపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘నేరెళ్ల’ కేసును సీబీఐకి అప్పగించండి
హైకోర్టులో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్ సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామ దళితులపై పోలీసుల దాడి కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలైంది. బాధితులను నిమ్స్‌కు తరలించి వారికి సరైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరి హారం అందించేలా ఆదేశాలివ్వాలన్నారు. ఈ వ్యాజ్యంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డైరెక్టర్, జిల్లా ఎస్పీ, జైలు సూపరింటెండెంట్‌తోపాటు ఎస్పీ విశ్వజిత్, సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. -
‘నేరెళ్ల’పై ఎన్హెచ్ఆర్సీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని కోరిన నేతలు సాక్షి, న్యూఢిల్లీ: నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఆధ్వర్యంలో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు... ఎన్హెచ్ఆర్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తును ఢిల్లీలో మంగళవారం కలసి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని చిత్రహింసలకు గురి చేశారన్నారు. దీనిపై విచారణ జరిపించడానికి ప్రత్యేకంగా కేంద్ర బృందాన్ని నేరెళ్లకు పంపి నిజానిజాలను నిర్ధారించాలని కోరారు. సమావేశం అనంతరం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. తాము చేసిన ఫిర్యాదులపై కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కేంద్ర బృందాన్ని పంపి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 14 ఏళ్లపాటు ఉద్యమం చేశానని చెబుతున్న కేసీఆర్‌పై అప్పట్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించివుంటే ఈ రోజు ఆయన ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రభుత్వంపై, జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరామన్నారు. ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు మూడేళ్ల కాలం లో 42 మందిని అధికార పార్టీ నేతలు హత్య చేశారని ఎంపీ రేణుకాచౌదరి ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన ప్రభుత్వ పెద్దలు.. బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేయడం సిగ్గుచేట న్నారు. కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
నేరెళ్ల ఘటన దురదృష్టకరం.. బాధాకరం
బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్ ఇందులో దళిత కోణం లేదు.. ఇసుక మాఫియా లేదు డీఐజీ స్థాయిలో విచారణ.. నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోం ప్రతిపక్షాలది సందర్శక పాత్రే.. వారి తిట్లు మాకు దీవెనలు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించిన కేటీఆర్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టీకరణ సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో జరిగిన ఘటన దురదృష్టకరం.. బాధాకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలను మానవీయ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదీ ప్రోత్సహించదన్నారు. ఈ సంఘటన క్షణికావేశంలో జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఘటనపై డీఐజీస్థాయి అధికారి విచారణ జరుపుతున్నారని, బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. దళిత కోణం లేదు.. ఇసుక మాఫియా లేదు నేరెళ్ల ఘటనలో దళిత కోణం లేదని, ఇసుక మాఫియా కూడా లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. మధ్యమానేరు ప్రాజెక్టులో ఈ ఏడాది నీరు నిల్వ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, నీట మునిగిపోయే ప్రాంతంలో ఇసుకను రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా చట్టబద్ధంగానే తరలిస్తున్నామని కేటీఆర్ వివరించారు. మూడు నెలల్లో ఇసుక ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని, కాంగ్రెస్ పార్టీ హయాంలో 45 ఏళ్లలోనూ ఇంత ఆదాయం రాలేదని చెప్పారు. గత నెల 2న రోడ్డు ప్రమాదంలో రైతు భూమయ్య చనిపోవడం, లారీలు దహనం కావడం, పోలీసులు కేసులు పెట్టడం జరిగిందని, ఇందులో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. పోలీస్ కేసులో దళితులు, ఎస్టీలు, బీసీలు ఉన్నారని మంత్రి వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుకాసురులు సహజవనరులు దోచుకున్నారని ఆరోపించారు. నేరెళ్ల ఘటనలో దళితులను టార్గెట్ చేశామనడం అర్థరహితమన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఇసుక తరలిస్తూ అభివృద్ధి పనులకు వినియోగిస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలది సందర్శకుల పాత్రే.. నేరెళ్ల ఘటనలో ప్రతిపక్షాలది సందర్శకుల పాత్రేనని కేటీఆర్ వివరించారు. ఈ ఘటనపై రాజకీయ లబ్ధి పొందాలని వారు చూస్తున్నారని, తమపై దుమ్మెత్తిపోశారని, అయితే ప్రతిపక్షాల తిట్లను దీవెనలుగానే భావిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నా నియోజకవర్గ ప్రజ లకు.. నాకు మధ్య ఎడం, దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మీరు సఫలీకృతులు కాలేరు. మీరంతా టూరిస్టులే. వచ్చితిట్టిపోయేవారే’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడేది, వారితో ఉండేది, వారి బాగోగులను చూసుకునే బాధ్యత టీఆర్ఎస్, ప్రజలు గెలిపిం చిన తనదేనన్నారు. నేరెళ్ల బాధితులకు ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందిస్తామని, హైదరాబాద్‌కు తీసుకెళ్తామని చెప్పారు. కోర్టుతో మాట్లాడి వారు కోలుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు బాధితులకు న్యాయంచేసేలా వ్యవహరించాలని, దురుద్దేశంతో మాట్లాడవద్దని, నేరెళ్ల ఘటనకు రాజ కీయ రంగు పులమొద్దని కేటీఆర్ హితవుపలికారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదైందని, ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేస్తామని చెప్పారు. బాధితులకు తాత్కాలిక సాయం కాకుండా.. అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మంథని ఎమ్మెల్యే పుట్టా మధు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఉన్నారు. పోలీసులు హింసించారన్నారు.. బాధితులతో మాట్లాడినప్పుడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఏమీ చెప్పలేదని కేటీఆర్ తెలిపారు. పోలీసులు తమని హింసించారని, హింసించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారన్నారు. ఆ విషయంలో తాను వారికి ఒక్కటే చెప్పానని, డీఐజీస్థాయిలో విచారణ జరుగుతోందని, ఆ నివేదిక ఆధారంగా బాధ్యులు ఎవరని తేలినా తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చానని, ఆ మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. పొరపాటున కూడా ఇలాంటి సంఘటనలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదన్నారు. బాధితుల ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోప్యంగా కేటీఆర్ పర్యటన.. ముందుగా ఎలాంటి ప్రకటనా లేకుండానే మంత్రి కేటీఆర్ వేములవాడకు చేరుకుని నేరెళ్ల బాధితులను పరామర్శించారు. ఇదంతా చాలా గోప్యంగా జరిగింది. మీడియాను కూడా అనుమతించకుండానే కేటీఆర్ బాధితులను కలసి మాట్లాడారు. నేరెళ్ల ఘటనపై వివాదం రేగడం.. జాతీయ సమస్యగా మారడంతో కేటీఆర్ బాధితులను పరామర్శించారు. -
వాళ్లు టూరిస్టులు.. నేను లోకల్: కేటీఆర్
సిరిసిల్ల: నేరెళ్ల బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నేరెళ్ళ బాధితులను మంగళవారం ఉదయం ఆయన పరామర్శించి దాదాపు గంట సేపు బాధితులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి డీఐజీ నివేదిక అందగానే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులంతా తన నియోజకవర్గ ప్రజలనీ, వీరి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ టూరిస్టులని, తను.. తన పార్టీ ఇక్కడ పర్మినెంట్ అని వ్యాఖ్యానించారు. కోర్టు వారితో మాట్లాడి హైదరాబాద్‌లో మెరుగయిన వైద్యం అందించేలా చూస్తామన్నారు. నేరేళ్ల ఘటన దురదృష్టకరం, అలా జరగాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. ప్రజలు దయతలచి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చామన్నారు. ఇలాంటి సంఘటనలను తాము ప్రోత్సహించమని వివరించారు. క్షణికావేశంలో లారీలను దగ్దం చేయడంతోనే పోలీసులు కేసులు పెట్టారని వివరించారు. ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే భరిస్తాం కానీ ఇసుక మాఫియా అని అంటే సహించబోమన్నారు. గత 50 ఇళ్లలో ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, ఈ మూడేళ్లలో వచ్చిన ఆదాయం గమనిస్తే.. ఇసుక మాఫియా ఎవరో తెలుస్తుందని అన్నారు. కేసుల్లో దళితులు, బీసీలు ఉన్నారని, దళితులపైనే పెట్టారని ఆరోపించడం తప్పన్నారు. మీడియా మిత్రులు అసౌకర్యానికి క్షమించాలని కోరారు. మీడియా జరగని తప్పును తప్పుగా చూపించవద్దు.. సంయమనం పాటించండని కోరారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక సాయం చేసి మళ్లీ మాకు ఓటు వేయమనే కుసంస్కారం మాది కాదన్నారు. -
ప్రాణభయం ఉంది.. ఇంటికి పంపించండి
నేరెళ్ల బాధితుల వేడుకోలు వేములవాడ: ‘ఏ పాపమూ ఎరగని మమ్మల్ని పోలీసులు అకారణంగా అరెస్టు చేసి.. కేసులు పెట్టి.. చిత్రహింసలకు గురి చేశారు. ఏ పనీ చేసుకోకుండా చేసి.. జైలుకు పంపారు. ఇప్పుడు షరతుల పేరుతో వేములవాడకే పరిమితం చేశారు. ఇక్కడ మాకు ప్రాణహాని ఉంది. మమ్మల్ని జైలులోనైనా ఉంచండి.. లేకుంటే మా ఇళ్లకైనా పంపండి..’అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బాధితులు వేడుకున్నారు. బెయిల్‌పై విడుదలై వేములవాడలో ఉన్న నిందితులు పెంట బానయ్య, కోల హరీశ్, చిట్యాల బాలరాజు, బత్తుల మహేశ్, పసుల ఈశ్వర్‌కుమార్, గందం గోపాల్ గురువారం విలేకరులతో మాట్లాడారు. కాయకష్టం చేసుకునే తమకు ఇప్పటికే నరకం చూపించారని, ఇప్పుడు వేములవాడలో ఉంచి ఏం చేస్తారోనని భయపడుతున్నామన్నారు. చిత్రహింసలకు గురిచేసిన ఎస్పీ, సీసీఎస్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు అండగా నిలిచి తమను రక్షించారని చెప్పారు. కాగా, వారిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్, ఇతర నాయకులు స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితులను గురువారం మానవ హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, దళిత లిబరేషనర్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ పరామర్శించారు.