ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని కోరిన నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ఆధ్వర్యంలో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు... ఎన్‌హెచ్‌ఆర్‌సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తును ఢిల్లీలో మంగళవారం కలసి ఫిర్యాదు చేశారు.
అధికార పార్టీ నేతల ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని చిత్రహింసలకు గురి చేశారన్నారు. దీనిపై విచారణ జరిపించడానికి ప్రత్యేకంగా కేంద్ర బృందాన్ని నేరెళ్లకు పంపి నిజానిజాలను నిర్ధారించాలని కోరారు. సమావేశం అనంతరం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. తాము చేసిన ఫిర్యాదులపై కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కేంద్ర బృందాన్ని పంపి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 14 ఏళ్లపాటు ఉద్యమం చేశానని చెబుతున్న కేసీఆర్‌పై అప్పట్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించివుంటే ఈ రోజు ఆయన ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు.
ఈ ఘటనకు బాధ్యులైన ప్రభుత్వంపై, జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరామన్నారు. ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు మూడేళ్ల కాలం లో 42 మందిని అధికార పార్టీ నేతలు హత్య చేశారని ఎంపీ రేణుకాచౌదరి ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన ప్రభుత్వ పెద్దలు.. బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేయడం సిగ్గుచేట న్నారు. కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
‘నేరెళ్ల’పై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Published Wed, Aug 9 2017 3:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement