
నేరెళ్ల ఘటన దురదృష్టకరం.. బాధాకరం
- బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్
- ఇందులో దళిత కోణం లేదు.. ఇసుక మాఫియా లేదు
- డీఐజీ స్థాయిలో విచారణ.. నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు
- ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోం
- ప్రతిపక్షాలది సందర్శక పాత్రే.. వారి తిట్లు మాకు దీవెనలు
- ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించిన కేటీఆర్
- బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టీకరణ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో జరిగిన ఘటన దురదృష్టకరం.. బాధాకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలను మానవీయ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదీ ప్రోత్సహించదన్నారు. ఈ సంఘటన క్షణికావేశంలో జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఘటనపై డీఐజీస్థాయి అధికారి విచారణ జరుపుతున్నారని, బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
దళిత కోణం లేదు.. ఇసుక మాఫియా లేదు
నేరెళ్ల ఘటనలో దళిత కోణం లేదని, ఇసుక మాఫియా కూడా లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. మధ్యమానేరు ప్రాజెక్టులో ఈ ఏడాది నీరు నిల్వ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, నీట మునిగిపోయే ప్రాంతంలో ఇసుకను రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా చట్టబద్ధంగానే తరలిస్తున్నామని కేటీఆర్ వివరించారు. మూడు నెలల్లో ఇసుక ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని, కాంగ్రెస్ పార్టీ హయాంలో 45 ఏళ్లలోనూ ఇంత ఆదాయం రాలేదని చెప్పారు.
గత నెల 2న రోడ్డు ప్రమాదంలో రైతు భూమయ్య చనిపోవడం, లారీలు దహనం కావడం, పోలీసులు కేసులు పెట్టడం జరిగిందని, ఇందులో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. పోలీస్ కేసులో దళితులు, ఎస్టీలు, బీసీలు ఉన్నారని మంత్రి వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుకాసురులు సహజవనరులు దోచుకున్నారని ఆరోపించారు. నేరెళ్ల ఘటనలో దళితులను టార్గెట్ చేశామనడం అర్థరహితమన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఇసుక తరలిస్తూ అభివృద్ధి పనులకు వినియోగిస్తోందని చెప్పారు.
ప్రతిపక్షాలది సందర్శకుల పాత్రే..
నేరెళ్ల ఘటనలో ప్రతిపక్షాలది సందర్శకుల పాత్రేనని కేటీఆర్ వివరించారు. ఈ ఘటనపై రాజకీయ లబ్ధి పొందాలని వారు చూస్తున్నారని, తమపై దుమ్మెత్తిపోశారని, అయితే ప్రతిపక్షాల తిట్లను దీవెనలుగానే భావిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నా నియోజకవర్గ ప్రజ లకు.. నాకు మధ్య ఎడం, దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మీరు సఫలీకృతులు కాలేరు. మీరంతా టూరిస్టులే. వచ్చితిట్టిపోయేవారే’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడేది, వారితో ఉండేది, వారి బాగోగులను చూసుకునే బాధ్యత టీఆర్‌ఎస్, ప్రజలు గెలిపిం చిన తనదేనన్నారు. నేరెళ్ల బాధితులకు ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందిస్తామని, హైదరాబాద్‌కు తీసుకెళ్తామని చెప్పారు.
కోర్టుతో మాట్లాడి వారు కోలుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు బాధితులకు న్యాయంచేసేలా వ్యవహరించాలని, దురుద్దేశంతో మాట్లాడవద్దని, నేరెళ్ల ఘటనకు రాజ కీయ రంగు పులమొద్దని కేటీఆర్ హితవుపలికారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదైందని, ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేస్తామని చెప్పారు. బాధితులకు తాత్కాలిక సాయం కాకుండా.. అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మంథని ఎమ్మెల్యే పుట్టా మధు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఉన్నారు.
పోలీసులు హింసించారన్నారు..
బాధితులతో మాట్లాడినప్పుడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఏమీ చెప్పలేదని కేటీఆర్ తెలిపారు. పోలీసులు తమని హింసించారని, హింసించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారన్నారు. ఆ విషయంలో తాను వారికి ఒక్కటే చెప్పానని, డీఐజీస్థాయిలో విచారణ జరుగుతోందని, ఆ నివేదిక ఆధారంగా బాధ్యులు ఎవరని తేలినా తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చానని, ఆ మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. పొరపాటున కూడా ఇలాంటి సంఘటనలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదన్నారు. బాధితుల ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గోప్యంగా కేటీఆర్ పర్యటన..
ముందుగా ఎలాంటి ప్రకటనా లేకుండానే మంత్రి కేటీఆర్ వేములవాడకు చేరుకుని నేరెళ్ల బాధితులను పరామర్శించారు. ఇదంతా చాలా గోప్యంగా జరిగింది. మీడియాను కూడా అనుమతించకుండానే కేటీఆర్ బాధితులను కలసి మాట్లాడారు. నేరెళ్ల ఘటనపై వివాదం రేగడం.. జాతీయ సమస్యగా మారడంతో కేటీఆర్ బాధితులను పరామర్శించారు.