వాళ్లు టూరిస్టులు.. నేను లోకల్: కేటీఆర్
సిరిసిల్ల: నేరెళ్ల బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నేరెళ్ళ బాధితులను మంగళవారం ఉదయం ఆయన పరామర్శించి దాదాపు గంట సేపు బాధితులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి డీఐజీ నివేదిక అందగానే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులంతా తన నియోజకవర్గ ప్రజలనీ, వీరి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ టూరిస్టులని, తను.. తన పార్టీ ఇక్కడ పర్మినెంట్ అని వ్యాఖ్యానించారు. కోర్టు వారితో మాట్లాడి హైదరాబాద్‌లో మెరుగయిన వైద్యం అందించేలా చూస్తామన్నారు.
నేరేళ్ల ఘటన దురదృష్టకరం, అలా జరగాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. ప్రజలు దయతలచి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చామన్నారు. ఇలాంటి సంఘటనలను తాము ప్రోత్సహించమని వివరించారు. క్షణికావేశంలో లారీలను దగ్దం చేయడంతోనే పోలీసులు కేసులు పెట్టారని వివరించారు. ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే భరిస్తాం కానీ ఇసుక మాఫియా అని అంటే సహించబోమన్నారు. గత 50 ఇళ్లలో ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, ఈ మూడేళ్లలో వచ్చిన ఆదాయం గమనిస్తే.. ఇసుక మాఫియా ఎవరో తెలుస్తుందని అన్నారు. కేసుల్లో దళితులు, బీసీలు ఉన్నారని, దళితులపైనే పెట్టారని ఆరోపించడం తప్పన్నారు. మీడియా మిత్రులు అసౌకర్యానికి క్షమించాలని కోరారు. మీడియా జరగని తప్పును తప్పుగా చూపించవద్దు.. సంయమనం పాటించండని కోరారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక సాయం చేసి మళ్లీ మాకు ఓటు వేయమనే కుసంస్కారం మాది కాదన్నారు.