
బీసీ హాస్టల్‌లో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ ధర్మారెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్) : జిల్లాలోని హాస్టళ్లలో ఏ సమస్యలు లేకుండా తొలగిస్తామని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఆయన కౌడిపల్లి మండల కేంద్రంలోని బీసీ, ఎస్టీ హాస్టల్‌తోపాటు కౌడిపల్లి మహాత్మాజ్యోతీబాపూలే బీసీ గురుకులం, తునికిలోని మత్స్యకారుల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి హాస్టల్‌లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో బాత్‌రూంలు, మరుగుదొడ్ల సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. అలాగే కౌడిపల్లిలోని గురుకులంలో అదనపు గదుల నిర్మాణం పనులను పరిశీలించారు. వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పార్ట్ బీ లోని భూముల రైతులు ఆందోళన చెందవద్దని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి రైతులకు పాస్‌బుక్కులు ఇస్తామన్నారు.
ఆలస్యమైనా.. ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అంతకుముందు మండల కేంద్రమైన కౌడిపల్లిలోని మినీ ట్యాంక్‌బండ్ చెరువుకట్టపై హరితహారం మొక్కలు నాటేందుకు గుంతలను పరిశీలించారు. బీసీ, ఎస్టీ హాస్టల్, బీసీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది కోటి 31 లక్షలు మొక్కలు నాటేందుకు లక్షం నిర్ధేశించుకోవడం జరిగిందన్నారు.
అందుకుగాను నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో గుంతలు తవ్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటుతామని తెలిపారు. ఈత, ఖర్జుర, పండ్ల మొక్కలకు కొదవ లేదన్నారు. ఈత వనం పెంచుకునే రైతులుంటే వారికి డ్రిప్ సౌకర్యం ఉందన్నారు.
ఇంటివద్ద పండ్ల మొక్కలు సైతం పెంచుకోని హరితహారం విజయంవతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ హనూక్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి శంకర్, ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ కిషన్, తహసీల్దార్ శ్రీశైలం, ఎంపీడీఓ కరుణశీల, ఏఈలు ప్రభాకర్, చిన్నినాయక్ వివిధ హాస్టల్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రామారావ్, వార్డెన్ గోవింద్ వివిధ అధికారులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment