ఆ రెండు రోజులు ఎక్కడున్నారు? | Where are those two days? | Sakshi
Sakshi News home page

ఆ రెండు రోజులు ఎక్కడున్నారు?

Published Mon, Apr 6 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

ఆ రెండు రోజులు ఎక్కడున్నారు?

ఆ రెండు రోజులు ఎక్కడున్నారు?

  • రైలు టికెట్ ఎక్కడిది..
  •  పలు కోణాల్లో విచారణ
  •  సూర్యాపేట కాల్పులతోనే దుండగుల గుర్తింపు
  •  ఉగ్రవాదుల ఫొటోలను గుర్తుపట్టిన హోంగార్డు కిశోర్
  • సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దుండగులకు ‘సిమి’ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు ముందే ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల ఒకటిన అర్ధరాత్రి సూర్యాపేట హైటెక్ బస్టాండులో  కాల్పులు జరిగిన తర్వాత దుండగులు పరారయ్యారు. వారి రూపురేఖలు కూడా బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజీల్లో  స్పష్టంగా కనిపించలేదు. కాల్పుల్లో కానిస్టేబుళ్లు మహేశ్, లింగయ్య అక్కడికక్కడే చనిపోగా, సీఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    ఈ నేపథ్యంలో అసలు నిందితులెవరనేది అప్పటికి గుర్తించలేని పరిస్థితి. దీంతో అనుమానితుల ఫొటోలను హోంగార్డు కిశోర్‌కు పోలీసులు చూపించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా ముఠాలకు చెందిన దోపిడీ దొంగలతోపాటు ఉగ్రవాదుల ఫొటోలను కూడా చూపించగా, సూర్యాపేటలో కాల్పులు జరిపిన అస్లాం అయూబ్, ఎజాజుద్దీన్‌ను కిశోర్ గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో దుండగుల ఎన్‌కౌంటర్‌కు ముందే వారు ఖాండ్వా జైలు నుంచి పరారైన సిమి ఉగ్రవాదులేనని పోలీసులు నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.
     
    రెండు రోజులు ఎక్కడున్నారు?

    సూర్యాపేట కాల్పుల తర్వాత ఎన్‌కౌంటర్ జరిగే వరకు రెండు రోజుల పాటు దుండగులు ఎక్కడ తలదాచుకున్నారన్న విషయం పోలీసులకు అంతుపట్టడం లేదు. ఏమాత్రం పసిగట్టలేని విధంగా దుండగులు వ్యవహరించారు. అనూహ్యంగా శనివారం ఉదయం అర్వపల్లి సమీపంలో బయటకు వచ్చారు. దీంతో దాదాపు 54 గంటల పాటు వారు ఎక్కడ తలదాచుకున్నారో పోలీసులకు అర్థం కావడం లేదు. అర్వపల్లి గుట్టల్లోనే దాక్కున్నారని కొందరు, సూర్యాపేటలోనే ఉన్నారని మరికొందరు అంటున్నారు. అయితే, శుక్రవారం రాత్రి మాత్రం వాళ్లు అర్వపల్లిలోని ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గాకు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు.

    ఈ మేరకు దర్గా ముతవల్లీ మౌలానాను కూడా పిలిచి ప్రశ్నించారు. దర్గాలోనూ దుండగులు ఎక్కువసేపు లేరని, మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. వారు దర్గాకు అర్ధరాత్రి ఆటోలో వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, దుండగులకు అర్వపల్లి దర్గాకానీ, గుట్టలు కానీ ఎలా తెలిశాయన్నది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది.  
     
    ఆ డబ్బులెక్కడివి?

    మరోవైపు ఎన్‌కౌంటర్ స్థలంలో లభ్యమైన రైల్వే టికెట్ మిస్టరీ తేలడం లేదు. రైల్వే టికెట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, స్థానికంగా జరుగుతున్న చర్చ ప్రకారం.. ఒకటో తేదీ అర్ధరాత్రి సూర్యాపేట ఘటన జరగ్గా.. రైల్వే టికెట్‌లో మాత్రం రెండో తేదీన ఢిల్లీలో బయలుదేరినట్టు ఉంది. అంటే దుండగులు ఫోన్ చేసి మరో వ్యక్తిని పిలిపించుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుల వద్ద డబ్బుల్లేకపోవడంతో ఢిల్లీ నుంచి తెప్పించుకున్నారని, ఎవరో తీసుకువచ్చి వారికిచ్చి వెళ్లారనేది ఒక వాదన. నిందితుల దగ్గర దొరికిన రూ. 25 వేలు(పోలీసులు నిర్ధారించలేదు) అవేనన్న చర్చ జరుగుతోంది. డబ్బులు చేతికందిన తర్వాతే దుండగులు బయటకు వచ్చారని, అప్పటి వరకు రహస్యంగా ఉన్నారని అర్థమవుతోంది. అదే నిజమైతే ఢిల్లీ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు.. అతను మరెటైనా వెళ్లాడా అన్నది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement