పుస్తకాల బ్యాగులు మోయవలసిన బాల్యం... (ఫైల్ ఫొటో)
నందిపేట (నిజామాబాద్ జిల్లా) : అందరిలాగే చదువుకోవాలని తలంచినది ఆ బాలిక. తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి చూపిన బిక్షాటన మార్గంలో తగినంత అడుక్కురాలేక పోతోంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన కన్న తండ్రి కాలయముడిగా మారి గదిలో బంధించి కట్టేసి చితకబాదాడు. పదేళ్ల ఆ బాలిక ఒళ్లంతా గాయాలవడమేకాక కాళ్లు చేతులు విరిగిపోయాయి. నిజామాబాద్ జిల్లా నందిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి . నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లికి చెందిన కోట ఎల్లప్ప కొంత కాలం క్రితం బతుకు దెరువు కోసం ఇద్దరు కూతుర్లను వెంట తీసుకుని నందిపేట వచ్చాడు. వీరు వృత్తిరీత్యా బుగ్గల వ్యాపారులు. ఎల్లప్ప తన భార్యను చంపిన ఘటనలో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే తిరిగి వచ్చాడు. వచ్చిన నాటి నుండి ఇద్దరు కూతుర్లను బిక్షటనకు పంపిస్తున్నాడు.
ప్రతి రోజు ఇద్దరు కూతుర్లు బిక్షాటన చేసిన డబ్బులు తండ్రికి తెచ్చి ఇవ్వాలి. శనివారం చిన్న కూతురు బడ్డెవ్వ సరిపడా డబ్బులు తీసుకురాలేదు. తప్ప తాగిన తండ్రి ఆగ్రహాంతో ఊగిపోతూ బాలికను గదిలో బంధించి, కిటికీకి కట్టేసి కొట్టాడు. దీంతో ఒడ్డెవ్వకు తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. కుడి చేయి, కాలు విరిగి పోయి నిస్సహాయ స్థితిలో పడిపోయింది. చుట్టుపక్కలవారు ఈ విషయం తెలుసుకుని, బాలికను రక్షించి అంబులెన్సుకు సమాచారం అందించారు. ఎల్లప్ప వారితోనూ గొడవకు దిగే ప్రయత్నం చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎల్లప్పను అదుపులోకి తీసుకున్నారు. గామపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు. తండ్రి విచక్షణా రహిత చర్యకు సహాయ పడిన పెద్దకూతురు పోసాని పరారయింది.