తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏది?
ఉమ్మడి రాష్ట్రంలో కబడ్డీ
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర క్రీడగా కబడ్డీ ఉంది. ఇప్పుడు అదే క్రీడను తెలంగాణ రాష్ట్ర క్రీడగా ప్రకటిస్తారా.. లేక వేరే క్రీడను ప్రకటిస్తారా అన్న ఆసక్తి క్రీడా సంఘాల్లో ప్రస్తుతం నెలకొంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం గ్రామీణ క్రీడలైన ఖోఖో, కబడ్డీ వంటి క్రీడలకు ప్రాధాన్యమిచ్చి ప్రోత్సాహాన్ని అందించింది. కబడ్డీని రాష్ట్ర క్రీడగా చేసి మరింత ఆదరణను తీసుకొచ్చింది.
తొలి మహిళా ఏషియన్ కబడ్డీ పోటీలను హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించి శెభాష్ అనిపించుకుంది. ఖోఖోలో 2వ అంతర్జాతీయ నెహ్రూ గోల్డ్ కప్‌కు హైదరాబాద్ ప్రాతినిథ్యం ఇవ్వడమే కాకుండా భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణలో గ్రామీణ క్రీడలైన ఖోఖో, కబడ్డీ లాంటి క్రీడలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. మరి ఏ ఆటకు రాష్ట్ర క్రీడ హోదా దక్కనుందో తేలాల్సి ఉంది.
గ్రామీణ క్రీడలకేది ప్రాధాన్యం?
ఖోఖో, కబడ్డీ క్రీడలు పురాతన కాలం నుంచి ఆడుతున్నారు. గ్రామీణ క్రీడలుగా పేరుగాంచిన క్రీడలు దేశంలో బహుశా ఈ రెండే. మరి ఈ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర క్రీడగా అవకాశం వరించేనా.. అని అంతా ఆశతో ఎదురుచూస్తున్నారు క్రీడాకారులు. వీటిని గ్రామీణుల, పేదల క్రీడలుగా పరిగణిస్తారు. ఖోఖో, కబడ్డీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఆడుతుంటారు. డబ్బులున్న బడాబాబులు ఇలాంటి ఆటలు ఆడేందుకు ఇష్టపడరు. ఖర్చు లేకుండా క్రీడలు ఖోఖో, కబడ్డీ క్రీడలను ఇట్టే ఆడేయచ్చు. మరి ఇలాంటి క్రీడలు నేటి కాలంలో ఆదరణ కోల్పోతున్నాయి. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ అంటే యువతకు యమ క్రేజ్. ప్రభుత్వాలు సైతం ఆయా క్రీడల్లో రాణించిన వారికి నజరానాలు అందిస్తున్నాయి. దీంతో గ్రామీణ క్రీడలు మరుగున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కబడ్డీ, ఖోఖో ఈ రెండింట్లో ఏదో ఒక దానికి రాష్ట్ర క్రీడగా ఎంపిక చేస్తే గ్రామీణ క్రీడలను పునఃవైభవం రాకతప్పదని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.
అవకాశం దక్కేనా...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని క్రీడాంశాలు ఆంధ్రప్రదేశ్ క్రీడా సంఘంగా కాకుండా తెలంగాణ రాష్ట్రం సంఘంగా వారి క్రీడా వ్యవహారాలు కొనసాగేవి. జాతీయ స్థాయి పోటీల్లో సైతం తెలంగాణ జట్టుగా బరిలో నిలిచేవి. తెలంగాణ ఖోఖో సంఘం, హైదరాబాద్ క్యారం అసోసియేషన్, తెలంగాణ బాడీ బిల్డింగ్, హైదరాబాద్ హాకీ అసోసియేషన్‌తో పాటు మరికొన్ని క్రీడలు తెలంగాణ రాష్ట్రం సంఘంగానే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్లుగా బరిలో దిగుతూ వచ్చాయి. మరి వచ్చిన కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం నాడు తెలంగాణ క్రీడా సంఘం పేరుతో ఉన్న క్రీడల్లో ఒక దానిని తెలంగాణ రాష్ట్ర క్రీడగా ప్రకటిస్తారో లేదో వేచిచూడాల్సిందే. ఇన్నేళ్లు తెలంగాణ సంఘంగా ఉన్నాం. తమకే రాష్ట్ర క్రీడగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ సంఘంతో ఉన్న పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
క్రీడారంగంలో అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారు. కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో గ్రామీణుల భాగస్వామ్యంతోనే వారి ప్రాధాన్యం తెలుస్తుంది. గ్రామీణ క్రీడలను ఆదరించాలని నిత్యం చెప్పడం కాదు గ్రామీణ క్రీడలను గుర్తించే క్రమంలో కబడ్డీ, ఖోఖోలకు సముచిత స్థానం ఇస్తే ఆదరణ పెరుగుతుంది.
- పిన్నింటి రఘునాథరెడ్డి,ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఖోఖోను రాష్ట్ర క్రీడగా ప్రకటించాలి
తెలంగాణ ఖోఖో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారు. ఎన్నో పతకాలు సాధించి సత్తా చాటిన క్రీడాకారులు ఖోఖో క్రీడాకారులే. ఖోఖోను రాష్ట్ర క్రీడగా ప్రకటిస్తే మహారాష్ట్ర రాష్ట్రాన్ని సైతం శాసించే జట్లు ఇక్కడ తయారవుతాయి. క్రీడాకారుల ఉత్సాహాన్ని గుర్తింస్తూ ఖోఖో క్రీడకు ఇంకా ప్రముఖంగా గుర్తింపు రావాలంటే రాష్ట్ర క్రీడగా వెంటనే ప్రకటించే ఏర్పాట్లు చేయాలి. - లింగయ్య, పీఈటీ, మంచిర్యాల