
మాల్స్‌లో మద్యం
► షాపింగ్ మాల్స్‌కు సర్కారు గ్రీన్‌సిగ్నల్
► ఇక రాత్రి 11 గంటల వరకు వైన్‌షాప్‌లు
► ప్రతి వైన్‌షాప్ వద్ద రెండు సీసీ కెమెరాలు..
► కంట్రోల్ రూంతో అనుసంధానం
► లైసెన్స్ ఫీజు శ్లాబుల సంఖ్య ఆరు నుంచి నాలుగుకు కుదింపు
► దరఖాస్తు ధర రెట్టింపు.. లైసెన్స్ ఫీజులూ పెంపు
► 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరణ.. 22న లాటరీ
► అక్టోబర్ 1 నుంచి కొత్త షాపులు... రెండేళ్ల పాటు లైసెన్స్
► 2,216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్
మందుబాబులకు ఇక పండుగే పండుగ! అక్టోబర్ 1 నుంచి వైన్‌షాపుల్లోనే కాదు షాపింగ్‌మాల్స్‌లో కూడా కోరిన మందు బాటిల్స్ లభించనున్నాయి. రానున్న రెండేళ్ల కోసం రాష్ట్ర సర్కారు రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో ఇందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ పాలసీ ప్రకారం దరఖాస్తు చేసుకుని, నిర్దేశిత ఫీజు కట్టే ప్రతి షాపింగ్‌మాల్‌కూ మద్యం అమ్ముకునే వెసులుబాటు లభించనుంది. అలాగే వైన్‌షాపులు ఓ గంట పాటు ఎక్కువ సమయం అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటివరకు రాత్రి 10 గంటలకు షాపులు మూసేయాల్సి ఉండగా.. కొత్త పాలసీలో దాన్ని 11 గంటల వరకు పొడిగించారు.
అక్టోబర్ నుంచి అమ్మకాలు
2017–19 కాలానికిగాను మద్యం షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,216 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు కొత్త దుకాణాలకు లైసెన్స్ ఇస్తారు. ఇందుకు లాటరీల ద్వారా దుకాణ యజమానులను ఎంపిక చేస్తారు. లాటరీలో పాల్గొనేందుకు బుధవారం నుంచి ఈ నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 22న లాటరీలు తీసి దుకాణ యజమానులను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 1 నుంచి కొత్త షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతాయి.
దరఖాస్తు ధర, ఫీజులు ఇలా..
గతంలో రూ.50 వేలు ఉన్న దరఖాస్తు ఫీజును ఈసారి రూ.లక్షగా నిర్ణయించారు. దరఖాస్తు కింద తీసుకునే ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. దరఖాస్తుతోపాటు లైసెన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా కట్టాల్సి ఉంటుంది. లాటరీలో షాపు రాకపోతే ఈ ఈఎండీని తిరిగి చెల్లిస్తారు. ఈసారి లైసెన్స్ ఫీజు కూడా పెంచారు. గతంలో ఉన్న ఆరు శ్లాబులను నాలుగు శ్లాబులుగా కుదించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం.. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏడాదికి రూ.45 లక్షలుగా ఫీజును నిర్ధారించారు. 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 నుంచి 20 లక్షల వరకు ఉంటే.. రూ.85 లక్షలు, 20 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే రూ.1.10 కోట్లుగా లైసెన్స్ ఫీజును నిర్ధారించారు. దరఖాస్తు ధర పెంపుతో రూ.100 కోట్లు, లైసెన్స్ ఫీజు పెంపుతో రూ.100 కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. మొత్తంగా ఈ ఏడాది రూ.15,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తోంది.
సీసీకెమెరాలు తప్పనిసరి
కొత్త మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. ప్రతి దుకాణం పరిధిలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వాటిని ఎక్సైజ్ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేస్తారు. అదే విధంగా ప్రతి షాపులో హోలోగ్రామ్‌ల తనిఖీకి అవసరమైన యంత్రాంగాన్ని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.
ఒకవేళ నోటిఫైడ్ షాపులకు ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షాపులు ఏర్పాటు చేసే నిబంధనను కూడా నోటిఫికేషన్‌లో పొందుపర్చారు. గతేడాది మిగిలిపోయిన 72 దుకాణాలను కూడా అవసరమైతే ఇతర ప్రాంతాలకు కేటాయిస్తామని నోటిఫికేషన్‌లో తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించనున్నట్టు పేర్కొన్నారు.
జనాభా ప్రకారం నాలుగు శ్లాబులివే..
జనాభా ఫీజు ఏడాదికి రెండేళ్లకు (రూ.లక్షల్లో)
50 వేల వరకు 45 90
50,001–5 లక్షల వరకు 55 110
5,00,001–20 లక్షల వరకు 85 170
20 లక్షల పైన 110 220