మట్టెవాడ(వరంగల్): వరంగల్ రైల్వేస్టేషన్లో బుధవారం ఓ మహిళ అదృశ్యమైంది. వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు మేరకు.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎలిజబెత్ యునేసీ దానకుమారి(38) ఈ నెల 23న వరంగల్ రైల్వేస్టేషన్‌లో అదృశ్యమైంది. అయితే, ఆమె తన అక్క, తమ్ముడితో కలిసి పదిరోజుల పాటు గీసుగొండ మండలం ధర్మారంలోని చర్చిలో ప్రార్ధనలు చేసేందుకు వచ్చారు.
ఈ క్రమంలో తిరిగి తమ ఊరు వెళ్లేందుకు 23న వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో రైలు కోసం వేచి ఉన్న వారు రైలు రాగానే ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా దానకుమారి కనిపించలేదు. దీంతో రెండు రోజులు ఆమె ఆచూకీ కోసం బంధువుల ఇంటిలో వెతికారు. ఫలితం లేకపోవడంతో బుధవారం పోలీసులను సంప్రదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.