పాలమూరు పచ్చగుండాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘అధికారంలోకి వచ్చిన తర్వాత వలసల జిల్లాను పచ్చని పాలమూరుగా చేయాలని దివంగతసీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తపించారు. నెట్టెం పాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌లాంటి ప్రాజెక్టులు చేపట్టి లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలని కలలుగన్నారు. ఆయన బతికుండగానే 80 శాతం పనులు పూర్తిచేసినా, వైఎస్ మరణం తర్వాత ఇక్కడున్న పాలకులకు చిత్తశుద్ధి లేక ప్రాజెక్టులు పూర్తికాలేదు..’ అని వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యానించారు.
వైఎస్ మరణానంతరం గుండె చెదిరి మరణిం చిన వారి కుటుంబాలను శుక్రవారం ఐదోరోజు కూడా పరామర్శించారు. యాత్రలో భాగంగా శుక్రవారం షాద్‌నగర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసినివాళులర్పిం చారు.ఈ సందర్భంగా ఆమె ప్రజలనుఉద్దేశించి ప్రసంగించారు.‘మహబూబ్‌నగర్ జిల్లాను దశాబ్దాలుగా వలస జిల్లాగా పిలుచుకునే కర్మ పట్టింది. ఎన్నో దశాబ్దాలుగా జిల్లా ప్రజలు బతుకుదెరువు కోసం ముంబై, ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలుచోట్లకు వలస వెళ్తున్నారు.
పాలమూరు అంటే వైఎస్‌కు ప్రీతి ‘వైఎస్‌కు మహబూబ్‌నగర్ జిల్లా అంటే ఎంతో ప్రీతి. వెనుకబడిన ఈ ప్రాంతప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని భావించారు. మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ప్రాణాలొదిలిన మహనీయుల గొప్పతనాన్ని గుర్తించేం దుకు పరామర్శయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ‘రాజశేఖరరెడ్డి లాంటి ఒక మంచి మనసున్న నాయకుడు చనిపోతే ఆ బాధ భరించలేక కొన్ని వందల గుండెలు ఆగిపోవడం సామాన్యమైన విషయం కాదు.
మా నాన్నను వాళ్ల ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి మరణించిన వారి కుటుంబాలకు రాజన్న కుటుంబం నమస్కరిస్తోంది..’ అంటూ అభివాదం చేశారు. ఆయన ఆశయాలు, ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అద్భుత పథకాలకు మీరే సంరక్షకులుగా మారాలని ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు. ‘ వైఎస్ ఈ జిల్లాలోని బీడు భూములు, మట్టిదిబ్బలను చూశారు. మేతలేక డొక్కలెండిన పశువులను చూశారు. కుటుంబమంతా వలసపోగా ముసలివాళ్లు మాత్రమే మిగిలిన గ్రామాలను చూశారు. ఇక్కడి మట్టిలో ఏ దోశమూ లేదని.. పాలకుల నిర్లక్ష్యమే ఉందని.. ఈ నేలను సస్యశ్యామలం చేయాలని తలంచి.. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. ఆరోగ్యశ్రీ, ‘108’, భూ పంపిణీ, రూ.2కే కిలోబియ్యం పథకాలను ఇక్కడినుంచే ప్రారంభించారు.’ అని షర్మిల అన్నారు.
షర్మిలకు బ్రహ్మరథం పట్టారు: పొంగులేటి
‘వైఎస్ మరణం తర్వాత గుండె పగిలి మరణించిన కుటుంబాలను పరామర్శిస్తానంటూ నల్లకాలువలో జగన్ ఇచ్చిన వాగ్దానం మేరకే జిల్లాలో ఐదు రోజుల పాటు పరామర్శ యాత్ర చేసినట్లు వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆగిన గుండెలను తట్టడం కోసం షర్మిల జిల్లాలో 22 కుటుంబాలను పరామర్శించారు.
ఐదురోజుల్లో 11 నియోజకవర్గాల మీదుగా సాగిన పర్యటనలో ప్రతిచోటా షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టారని’ పొంగులేటి వ్యాఖ్యానించారు. ‘ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా 2004కు ముందు ఉన్న పరిపాలన, 2004 తర్వాత వైఎస్ పాలనకు పొంతనలేదని చెబుతున్నారు. వైఎస్ మరణం తర్వాత జరుగుతున్న పాలనకు కూడా పొంతన లేదు. ప్రతి కుటుంబాన్ని ఆదుకునేలావైఎస్ మంచి పనులు చేశారు.
ప్రతి సామాజికవర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టారు. అందుకే వైఎస్ మరణించి ఐదేళ్లు కావస్తున్నా ఆయను ప్రజలు ప్రేమించి గుండెల్లో పెట్టుకున్నారని’ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘వెళ్లిన ప్రతిచోటా ప్రజలు తమ గోస వినిపించారు. పింఛన్ లేదు. ఇల్లులేదు.తిండి లేదు. పంటలు ఎండిపోయాయి. మళ్లీ రాజన్న రాజ్యంరావాలని ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించారు. షర్మిల వారి బాధలో పాలు పంచుకున్నారు’ అని ఆయన అన్నారు.
పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే వైఎస్ కల నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పొంగులేటి పిలుపునిచ్చారు. ఎన్నికలు, రాజకీయం కోసం కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చేందుకు పరామర్శయాత్ర చేసినట్లు స్పష్టంచేశారు. అన్నివర్గాల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్ ఆశయాలు, పథకాలు కొనసాగాలంటే జగన్, పొంగులేటి నాయకత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
పేద ప్రజల ఆరాధ్య దైవం వైఎస్: ఎడ్మ
‘వలసల జిల్లా మహబూబ్‌నగర్‌కు పెద్దఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు వైఎస్‌ఆర్. మనకు ఆర్థికసాయం చేసి మన జీవన పరిస్థితిని మెరుగుపరిచి, వలసలు పోకుండా జిల్లాలోనే ఉపాధి కల్పించిన మహానేత. జిల్లాలో కష్టజీవులు, రైతులు, అన్నివర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రారంభించారు’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు.
‘లక్షలాది మంది గిరిజనులు, ఎస్సీ, ఎస్టీలు, ఇతరవర్గాలకు భూ పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు పేదప్రజల పొట్టగొడతే రెండు పూటలా తిండి పెట్టేందుకు రెండు రూపాయలకు కిలోబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ ఇక్కడ నుంచే ప్రారంభించారు. ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మనం ఆర్థికంగా బాగుపడ్డాం. జిల్లా అభివృద్ధికి వనరులు, వసతులు కల్పిం చారు.
పరామర్శ యాత్ర కోసం వచ్చిన షర్మిలకు మీ ఆశీస్సులు ఉన్నందుకు పేరుపేరునా కృతజ్ఞతలు’ అంటూ ఆయన ప్రసంగించారు. ఐదోరోజు పరామర్శ యాత్రలో పార్టీ నాయకులు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, భీష్వ రవీందర్, మాదిరెడ్డి భగవంతురెడ్డి, ఎం.రవీందర్‌రెడ్డి, హైదర్, బంగి లక్ష్మణ్, జెట్టి రాజశేఖర్, హన్మంతు, సుధాకర్‌రెడ్డి, గూడూరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.