సాక్షి, నిర్మల్ : అభిమానానికి హద్దు ఉండదనేదానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్ ఒక ఉదహరణగా నిలుస్తారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అనిల్‌కుమార్ వీరాభిమాని. వైఎస్ కుటుంబంపై అభిమానంతో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనిల్ ఆకాంక్షించారు. అప్పటివరకు పాదరక్షలు ధరించనని ప్రతిన బూనారు. దాదాపు పదేళ్ల తరువాత తన కళ నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో అనిల్‌కుమార్ తన పదేళ్ల మొక్కును తీర్చుకున్నారు. సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్న అనిల్‌కుమార్.. అమ్మవారి సన్నిధిలో దీక్ష విరమించారు. అనంతరం పదేళ్ల తరువాత తొలిసారిగా పాదరక్షలను ధరించారు.
వైఎస్ జగన్ సీఎం కావాలని..
అనిల్‌కుమార్ 1991లో రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ స్కూల్ ప్రెసిడెంట్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1992లో ఆదిలాబాద్ పట్టణ కోశాధికారి వ్యవహరించారు. ఆ తర్వాత పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా కన్వీనర్‌గా 1996 వరకు పనిచేశారు. 2006లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సంతకాల సేకరణ మహోద్యమంలో పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగతులైనప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించారు.. ఆమరణ దీక్షా చేపట్టారు.. ఆదిలాబాద్ నుంచి బాసర పుణ్యక్షేత్రం వరకు సుమారు 160 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అప్పుడే 2009 సెప్టెంబర్ 4న జగన్ సీఎం అయ్యేవరకు పాదరక్షలు ధరించనని ప్రతీన బూనారు. ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సుమారు పదేళ్ల తర్వాత ఆయన కల నెరవేరింది.
ఆయన బిడ్డ ‘సాక్షి’.
తాను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఘడియ రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైఎస్‌ఆర్, వైఎస్సార్ జగన్‌మోహన్‌రెడ్డి వీరాభిమాని అయిన బెజ్జంకి అనిల్‌కుమార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటూ వచ్చారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలుబడిన క్షణాన్ని ఆయన మరిచిపోలేకుండా ఉన్నారు. గతంలో వైఎస్సార్ జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వెన్నంటే నిలిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆ తల్లి వెన్నంటే నిలిచారు. అనిల్‌కుమార్ వైఎస్సార్ కుటుంబానికి ఎంత వీరాభిమాని అంటే.. ఆయన తమ్ముడు బెజ్జంకి సంతోష్‌కుమార్‌కు ‘సాక్షి’ పత్రిక ఆవిర్భావం రోజు కూతురు పుట్టడంతో ఆమెకు ‘సాక్షి’ అనే పేరు పెట్టి తన అభిమానం చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment