దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలను బుధవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలను బుధవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. బడుగువర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన వైఎస్ ప్రతి పేదోడి గుండెలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని, ఇప్పటికీ ఆయన అబివృద్ధి పథకాలే ప్రజలకు గుర్తున్నాయని, పేదలపెన్నిధిగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందని పలువురు నాయకులు కొనియాడారు.
ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందజేసి ప్రతి ఇంటికీ ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ఘనత ఆయకే దక్కిందన్నారు. అదేస్ఫూర్తితో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు పేద ప్రజల అభ్యున్నతికి అంకితం కావాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సామాన్యులకు కష్టాలు వచ్చినప్పుడు గుర్తొచ్చే పేరు దివంగత వైఎస్సేనని పేదలకు మళ్లీ స్వర్ణయుగం రావాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడమే మార్గమని అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని మహబూబ్‌నగర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి కల్వకుర్తిలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడ్మకిష్టారెడ్డి తదితరులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో మానసిక వికలాంగులతో కలిసి వైఎస్ జన్మదిన వేడుకలను నిర్వహించి ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేయించారు. అలాగే జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, కొడంగల్, దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్ తదితర నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ అభిమానులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.