వైఎస్ పథకం.. పేదలకు జీవం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా..’ అంటూ కవులు జిల్లాలో కరువును కళ్లకుగట్టారు. పాల మూరు వలస బాధలు తీర్చి, వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు జనహృదయ నేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన దార్శనికత ఎనలేనిది.
ఆయన ప్రవేశపెట్టిన జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ గృహ నిర్మాణం ఇలా పథకమేదైనా జిల్లా ప్రజల శ్రేయస్సే ప్రత్యేక లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. ఆ పథకాలు పేదల బతుకుకు భరోసానిచ్చాయి. లక్షలాదిమంది లబ్ధిదారులు వాటిని వినియోగించుకొని జీవితాల్లో సంతోషాన్ని నింపుకున్నారు. ఇలా.. తనదైన పాలనతో ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న నేత హఠాన్మరణం నిరుపేదల గుండెలకు గాయం చేసింది. కానరాని లోకాలకు వెళ్లిన రాజన్నను తలచుకుంటూ 21మంది నిరుపేదలు ప్రాణాలు వదిలారు.
ఆ కుటుంబాలను పరామర్శించేం దుకు వస్తున్న వైఎస్‌ఆర్ తనయురాలు షర్మిల పరామర్శ యాత్రను జయప్రదం చేసేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి రికార్డుస్థాయిలో 49 పర్యాయాలు పర్యటించారు. పల్లెబాట, రాజీవ్ నగరబాట ఇలా కార్యక్రమమేదైనా పాలమూరు జిల్లాపై వరాల జల్లు కురిపిస్తూ వచ్చారు. పాలమూరు జిల్లాలో కరవు, వలసల శాశ్వత నివారణకు ‘జలయజ్ఞం’ చేపట్టారు. సుమారు పది వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నాలుగు ప్రధాన ప్రాజెక్టులను చేపట్టి జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు పునాదులు వేశారు.
ఎనిమిది ల క్షల ఎకరాలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా చేపట్టిన కల్వకుర్తి, కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు తర్వాత పాలకులు నిధులు విదల్చకపోవడంతో పనుల పురోగతి కనిపించడం లేదు. విద్యాపరంగా పాలమూరును అభివృద్ధి చేసేందుకు ‘పాలమూరు యూనివ ర్సిటీ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. సామాజిక భద్రత పింఛన్లు, ఫీజు రియింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ, వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ, రేషన్‌కార్డులు ఇలా వైఎస్ చేపట్టిన ప్రతి కార్యక్రమం పేదల మదిలో నేటికీ మెదులుతూనే వున్నాయి. ఆత్మహత్య బాధిత రైతు కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ ప్రవేశపెట్టిన జీఓ 421 పేదలకు ఆలంబనగా నిలిచింది. వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు జిల్లాలో లక్షలాది కుటుంబాలకు ఆలంబనగా నిలిచాయి. జిల్లా సర్వ సమగ్రాభివృద్ధిని కాంక్షించిన వైఎస్ హఠాన్మరణం పాలమూరు అభివృద్ధిపై పెను ప్రభావాన్ని చూపింది. వైఎస్ తర్వాత వచ్చిన పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం నిరుపేదల పాలిట శాపంగా మారింది. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో కోత విధించడం జన సామాన్యాన్ని కడగండ్లకు గురి చేస్తోంది. వైఎస్ పాలనలో తాము పొందిన మేలు తలుచుకుంటూ షర్మిల రాకకోసం ఎదురుచూస్తున్నారు.
షర్మిల రాక మాకెంతో సంతోషం
2009 నవంబర్ 5న పేదలపెన్నిధి అన్న రాజన్న అకాల మరణాన్ని టీవీలో చూస్తూ మా ఇంటి పెద్దాయన గుండెపోటుతో మరణించాడు. నాటినుంచి కుటుంబ పోషణ నామీదే ఆధారపడింది. నా రెక్కల కష్టంతోనే పిల్లలను చదవిస్తున్నాను. భర్తను పొగొట్టుకున్ననన్ను తండ్రిని పొగొట్టుకున్న నాపిల్లలను పరామర్శించడానికి వస్తుండడం ఎంతో సంతోషంగా ఉంది. - జడ్డు స్లీవమ్మ, మృతుడు రాయపురెడ్డి భార్య, రెడ్డిపురం గ్రామం
అలాగే మండలంలోని పడకల్ పంచాయతీ దేవునిపడకల్ గ్రామానికి చెందిన తమ్మల నర్సింహా (62) దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాని. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు వృద్ధులు, వికలాంగులు, పేదప్రజానీకానికి అండగా నిలిచాయని తన మిత్రులతో తరుచూ ముచ్చటించేవాడు. ఇదిలాఉండగా, వైఎస్ మరణవార్త విని ఇంట్లోనే మృతిచెందాడు. ఆయన భార్య నర్సమ్మతో పాటు సుధాకర్, రుక్నమ్మ ఇద్దరు సంతానం. భార్య నర్సమ్మ వృద్ధురాలు కావడంతో ఇంట్లోనే ఉంటుంది. కొడుకు సుధాకర్ వ్యవసాయకూలీగా జీవనం గడుపుతున్నాడు.
వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక..
తలకొండపల్లి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేక మండలంలో ఇద్దరు హఠాన్మరణం పాలయ్యారు. వెల్జాల్‌కు చెందిన సంతోజు అంజనమ్మ (60) వైఎస్ మరణవార్త విని జీర్ణించుకోలేకపోయింది. మూడురోజుల పాటు అన్నపానీయాలు మాని మంచం పట్టింది. టీవీ చూస్తూనే కుప్పకూలి కనుమూసింది. ఆమెకు భర్త హరిమోహనచారితో పాటు సరళ, సంపత్‌కుమార్, సరిత ముగ్గురు సంతానం ఉన్నారు. హరిమోహనచారి హైదారాబాద్‌లో ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తుండగా, సంపత్‌కుమార్ స్థానికంగా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.