
కంటతడి పెట్టిన వైఎస్ షర్మిల
నాగార్జున సాగర్ : వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని వైఎస్ షర్మిల గురువారం పరామర్శించారు. ఈరోజు ఉదయం వైఎస్ షర్మిల నాగార్జున సాగర్ హిల్కాలనీలోని వెంకట నర్సయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటనర్సయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉద్వేగానికి గురైన ఆమె కంటతడి పెట్టారు.
కాగా వెంకటనర్సయ్యకు ఐదుగురు కుమార్తెలు. నాగార్జునసాగర్ డ్యాం కార్యాలయంలో అటెండర్‌గా పని చేసేవాడు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అతడిని ఎంతగాను ఆకట్టుకున్నాయి. దాంతో వెంకటనర్సయ్య వైఎస్‌ఆర్ను ఆరాధ్యదైవంగా కొలిచేవాడు. ఈ క్రమంలో వైఎస్ దుర్మరణం అతన్ని కుంగదీసింది. ప్రజానేత కానరాని లోకాలకు వెళ్లాడే అని మదనపడ్డాడు. దిగులుతో ఆ తర్వాత రోజున ఆఫీస్‌లో వైఎస్ సంతాపసభ జరుగుతుండగా... బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం మగదిక్కులేనిది అయింది. ఆ కుటుంబం వెంకటనర్సయ్య జ్ఞాపకాలతో కాలాన్నీ వెళ్లదీస్తూ వస్తోంది.