
'తెలుగుజాతి ఉన్నంత వరకు వైఎస్ఆర్ సజీవం'
కోట్లాది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అకాల మరణంతో వందలాది గుండెలు ఆగిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభించారు. దేవరకొండ రోడ్ షోలో షర్మిల మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర, ఉచిత విద్యుత్తు, రైతులకు రుణాలు, ఉపాధిహామి లాంటి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదే అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కన్నతండ్రిలా ప్రజలకు మంచిపాలన అందించారని కొనియాడారు.
'పేదరికం కారణంగా చదువులు ఆగిపోరాదని ఆకాంక్షించిన వైఎస్ఆర్, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంతో లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారు. పేదవారికి జబ్బుచేస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి లక్షలాది మందికి వైద్యం అందించారు. వైఎస్ఆర్ హయాంలో ధరలు పెరగలేదు' అని షర్మిల అన్నారు. రాజన్నకు మరణం లేదు.. తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో సజీవంగా వైఎస్ఆర్ ఉంటారని చెప్పారు.