రైతుల గోడు పట్టించుకోరా..?
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
బూర్గంపాడు: అకాలవర్షాలతో పం టలు నష్టపోయిన రైతులను పాల కులు పట్టించుకోవడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాలవర్షంతో ఖమ్మం జిల్లా బూర్గంపాడు మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని, వర్షం ధాటికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యూర్డుకు తీసుకువస్తే.. అధికార యంత్రాంగం తీరు తో తీవ్రనష్టం జరిగిందన్నారు. ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నా పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షపార్టీగా విమర్శ చేయటం లేదని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల బాధలేమిటో తెలుస్తాయన్నారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో అకాలవర్షాలతో జరిగిన పంటనష్టాన్ని పరిశీలించామని చెప్పారు. పంటనష్టం తాలూకు విషయాలను పార్లమెంట్‌లో కేంద్ర వ్యవసాయమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. పొలాల్లో జరిగే నష్టం కంటే మార్కెట్‌యార్డులకు తీసుకువచ్చిన పంటలకు అధికనష్టం జరుగుతుందన్నారు. బూర్గంపాడు మార్కెట్‌యార్డులో సుమారు 70 లారీల ధాన్యం వర్షానికి తడిసిందని, 3 లారీల ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించి అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.