భాగమతి చిత్రం విజయోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి జగదాంబ థియేటర్‌లో సందడి చేసిన సినీ నటి అనుష్క శెట్టి
అందం, అభినయంతో కట్టిపడేయడమే కాదు.. అరుంధతిలా.. జేజెమ్మలా.. ఇప్పుడు భాగమతిలా చెలరేగిపోగలనని నిరూపించిన అందాల హీరోయిన్ అనుష్క విశాఖ నగరంలో సందడి చేసింది. భాగమతి సినిమా విజయ యాత్రలో భాగంగా సోమవారం అర్ధరాత్రి చిత్రాన్ని ప్రదర్శిస్తున్న జగదాంబ థియేటర్‌కు యూనిట్ సభ్యులతోపాటు చేరుకున్న అనుష్క సెకండ్ షో చూస్తున్న ప్రేక్షకులను చిత్రంలోని డైలాగులతో అలరించింది.
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎవరుపడితే వాళ్లు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా..భాగమతి అడ్డా..లెక్కతేలాలి. ఒక్కడ్నీ పోనివ్వను. అంటూ స్వీటీ అనుష్కశెట్టి డాల్బీ సౌండ్ రేంజ్‌లో డైలాగ్ చెప్పేసరికి విశాఖ ప్రేక్షకులు జేజెమ్మకు జేజేలు పలికారు. భాగమతి సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అనుష్క విజయోత్సవ యాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారం విజయవాడ, రాజమండ్రి థియేటర్లలో సందడి చేసిన అనుష్క జగదాంబ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి కొద్ది సేపు సినిమా వీక్షించారు. అనంతరం సినిమాలో పాపులర్ డైలాగ్‌లను స్వయంగా చెప్పి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. అనుష్క వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు జగదాంబ థియేటర్‌కు భారీగా చేరుకున్నారు. సరిగ్గా రాత్రి 11.05 గంటలకు అనుష్క రావడంతో థియేటర్ అభిమానులు కేరింతలు కొట్టారు. అనుష్కతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ముందుగా థియేటర్ నిర్వాహకులు అనుష్కకు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment