బాలనేరస్థుల సంక్షేమ గృహం నుంచి 11 మంది గత అర్థరాత్రి పరారైన సంఘటన బీహార్ భోజ్పూర్ జిల్లాలోని ధన్పూర గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం వివిధ ప్రాంతాలలో ముగ్గురు బాల నేరస్థులను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారి కథనం ప్రకారం... చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినమైన శ్రీ పంచమి సందర్భంగా నిన్న రాత్రి ధన్పూర బాలనేరస్థుల సంక్షేమ గృహంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
అయితే తాము పరారి అయ్యేందుకు అదే మంచి సమయంగా 11 మంది బాల నేరస్థులు భావించారు. దాంతో జైలు ఊచలు విరగొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆ విషయాన్ని గ్రహించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జిల్లా వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. బాలనేరస్థుల కోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు. దాంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.