ముజాఫర్ నగర్: ప్రభుత్వ జువైనల్ సంక్షేమ గృహంలో బందీలుగా ఉన్న ఏడుగురు బాల ఖైదీలు పరారీ అయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ లో మరోసారి చోటు చేసుకుంది. ఇందులో హత్యానేరంపై శిక్ష పడ్డ నలుగురు బాలలతోపాటు, అల్లర్లకు సంబంధించిన ఒక నిందితుడు, అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో నేరస్థుడు కూడా ఉన్నాడని అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ ఇందేర్మనీ త్రిపాఠీ తెలిపారు.
తప్పించుకోవడానికి పక్కా ప్రణాళిక రచించుకున్న వీరు.. అడ్డగించిన నలుగురు అధికారులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలోఇద్దరు హోం గార్డులకు తీవ్ర గాయాలైయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హెం గార్డుల పరిస్థితి విషమంగా ఉంది. తప్పించుకున్న వీరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నెల వ్యవధిలోనే ఇక్కడి నుంచి బాల ఖైదీలు తప్పించుకోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఇదే తరహా ఘటన గత నెల16 వ తేదీన చోటు చేసుకుంది.