
సీఆర్‌డీఏకు 12,598 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ)కు 12,598.42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని రాష్ట్ర సర్కారు తాజాగా నిర్ణయించింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం.. సీఆర్‌డీఏకు ముందస్తుగా అప్పగించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూసమీకరణ పథకం కింద ఈ భూమిని అప్పగిస్తున్నతట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇప్పటికే రాజధానికోసం సీఆర్‌డీఏ భూసమీకరణ కింద 33,500 ఎకరాల్ని రైతుల నుంచి సేకరించిన విషయం తెలిసిందే. తాజాగా 12,598.42 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింతతో ఇప్పటివరకూ రాజధాని భూసమీకరణ కింద సేకరించిన భూమి 46,098.42 ఎకరాలకు చేరినట్లయింది. మరో 2,200 ఎకరాల్ని భూసేకరణ ద్వారా సేకరించాలని సీఆర్‌డీఏ ఆలోచిస్తోంది.
ఇదిలా ఉండగా రాజధానికోసం మరో 45 వేల ఎకరాల అటవీభూమిని డీనోటిఫై చేయించే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో రాజధానికోసం సమీకరిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూమి తమొత్తం 91 వేల ఎకరాలు దాటిపోనుంది. దీనికి అదనంగా మరికొన్ని వేల ఎకరాల దేవాదాయ, గ్రామకంఠం భూములను కూడా సేకరించాలని సీఆర్‌డీఏ ప్రణాళిక రూపొందించింది. దీనితో రాజధానికోసం సమీకరించే భూమి లక్ష ఎకరాలు దాటుతుందని అంచనా.