
తమ్ముడితో ఆడుకుంటూ.. బాలిక మృతి
సరదాగా ఊటీ చూద్దామని కుటుంబంతో సహా వచ్చి, అక్కడ తన తమ్ముడితో ఆడుకుంటూ ఓ పాప తన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇక్కడి బొటానికల్ గార్డెన్ సమీపంలో జరిగింది. కర్ణాటకలోని చామరాజనగర్ నుంచి మొత్తం 12 మంది సభ్యులు గల బృందం ఊటీకి వచ్చింది. అందులో 12 ఏళ్ల బాలికతో పాటు 5 ఏళ్ల వయసున్న ఆమె తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్లిద్దరూ అక్కడ ఒక ఉయ్యాలలో ఆడుకుంటూ ఉండగా ఇద్దరూ అనుకోకుండా ఢీకొన్నారు.
దాంతో ఆమె తల ఉయ్యాల ఉన్న ఇనుప రాడ్‌కు తగిలింది. ఫలితంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలికను అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలిక తమ్ముడికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయని, అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు.