సాక్షి, చైన్నె: నీలగిరి కొండల్లో ప్రయాణించే ఊటీ టాయ్ ట్రైన్ గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. రెండు బోగీలు ట్రాక్ నుంచి బయటకు వచ్చేశాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికులను కొండ మార్గం గుండా ప్రత్యేక బస్సుల్లో మేట్టుపాళయానికి తరలించారు. నీలగిరి జిల్లాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఊటి. ఇక్కడకు రోడ్డు మార్గంలో కన్నా, రైలు మార్గంలో పయనం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బ్రిటీషు హయాంలో మేట్టు పాళయం నుంచి కున్నూరు వరకు తొలుత ఈ రైలు సేవలకు శ్రీకారం చుట్టారు.
తదుపరి దశల వారీగా విస్తరించి చివరకు ఊటీ వరకు ఈ రైలు సేవలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కొండలు, లోయల మధ్య సాగే ఈ ప్రయాణంలో 208 మలుపులు, 250 వంతెనలు, 16 సొరంగ మార్గాలు, 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు ప్రయాణం నిమిత్తం ముందుగా రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం ఓ రైలు మేట్టు పాళయం నుంచి ఊటీకి బయలు దేరుతుంది. మరో రైలు ఊటీ నుంచి మేట్టుపాళయంకు బయలు దేరుతుంది. ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం కున్నూరు రైల్వే స్టేషన్‌ను దాటి వంద మీటర్లు పయనించిన ఈ రైలు హఠాత్తుగా పట్టాలు తప్పింది.
వెనుక ఉన్న రెండు బోగీలు పూర్తిగా ట్రాక్ నుంచి కిందకు వచ్చేశాయి. డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అందులోని ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రయాణికులను కొండ మార్గంలో ప్రత్యేక బస్సులను రప్పించి మేట్టుపాళయంకు తరలించారు. వర్షం పడుతుండడం వల్లే రైలు బోగీలు జారి ట్రాక్ నుంచి బయటకు వచ్చి ఉంటాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ సకాలంలో రైలును ఆపి వేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. కాస్త ముందుకు వెళ్లి ఉంటే బోగీలు లోయలో పడి పెను ప్రమాదం సంభవించేదని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment