
బెల్జియంలో 16మంది అరెస్టు
పారిస్ ఘటనతో అప్రమత్తమైన బెల్జియం భద్రతా బలగాలు.. రాజధాని బ్రసెల్స్‌లో జరిపిన దాడుల్లో 16 మంది
బ్రసెల్స్‌లో కొనసాగుతున్న హైఅలర్ట్
ఉగ్రదాడుల భయంతో స్కూళ్లు, యూనివర్సిటీలు బంద్
బ్రసెల్స్: పారిస్ ఘటనతో అప్రమత్తమైన బెల్జియం భద్రతా బలగాలు.. రాజధాని బ్రసెల్స్‌లో జరిపిన దాడుల్లో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఫ్రాన్స్‌ఘటన నుంచి తప్పించుకున్నాడని భావిస్తున్న సలా అబ్దెస్లామ్ బెల్జియంలో తలదాచుకున్నాడనే అనుమానంతో హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. బ్రసెల్స్‌లో అణువణువూ గాలిస్తోంది. అయితే అరెస్టు అయిన వారిలో అబ్దెస్లామ్ లేడని స్పష్టం చేసింది. గాలింపు చర్యల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారుపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. మరోపక్క ఉగ్రదాడుల భయంతో బ్రసెల్స్‌లో స్కూళ్లు, యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించారు.
దీంతో అక్కడ ఇప్పుడప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించటం లేదు. కాగా, ఎమర్జెన్సీని మూడు నెలలపాటు పొడగించిన ఫ్రాన్స్.. పారిస్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. సిరియా, లెడ్రైన్ ప్రాంతాల్లో ఫ్రాన్స్ బలగాలు వైమానిక దాడులను ముమ్మరం చేశాయి. మరోవైపు, సిరియాలో ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసే విషయంపై పార్లమెంటుతో మాట్లాడాక నిర్ణయం తీసుకోనున్నట్లు యూకే ప్రధాని డేవిడ్ కామెరాన్ పారిస్‌లో తెలిపారు.