ట్రంప్‌కు మరో షాక్‌ | 2 Federal Judges Rule Against Trump's Latest Travel Ban | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు మరో షాక్‌

Published Fri, Mar 17 2017 1:40 AM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

ట్రంప్‌కు మరో షాక్‌ - Sakshi

ట్రంప్‌కు మరో షాక్‌

ఆరు ముస్లిం దేశాల వలస నిషేధాజ్ఞలపై హవాయ్‌ కోర్టు స్టే
ఇది అమల్లోకి వస్తే కోలుకోలేని గాయం తగులుతుంది: జడ్జి
అమలుకు కొద్ది గంటల ముందు అమెరికా అధ్యక్షుడికి ఝలక్‌


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులు అమెరికా రాకుండా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకువచ్చిన తాజా వలస నిషేధ ఉత్తర్వులకు కూడా హవాయ్‌ ఫెడరల్‌ కోర్టు బ్రేకులు వేసింది. అమెరికాలో మరికొద్ది గంటల్లో అమలు కావాల్సిన వలస నిషేధాజ్ఞలను అమలుచేయడానికి అంగీకరించబోమని హవాయ్‌ ఫెడరల్‌ కోర్టు జడ్జి డెరిక్‌ వాట్సన్‌ స్పష్టం చేశారు. ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాకు రాకుండా వలస నిషేధాజ్ఞలను ట్రంప్‌ గత నెలలో అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిం దే.

అయితే ఆ ఉత్తర్వులను పలు ఫెడరల్‌ కోర్టులు నిర్ద్వంద్వంగా నిలిపివేశాయి. దీంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ట్రంప్‌ తాజాగా సవరించిన నిబంధనలతో వలస నిషేధాజ్ఞలను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఈసారి ఇరాక్‌కు మినహాయింపు ఇచ్చి ఇరాన్, లిబియా, సోమాలియా, çసూడాన్, సిరియా, యెమన్‌ తదితర ఆరు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు. ట్రంప్‌ కొత్త ఆదేశాల ప్రకారం ఆరు ముస్లిం దేశాల వలసదారులపై 90 రోజులు, శరణార్థులపై 120 రోజులు నిషేధం ఉంది.

ఈ ఆదేశాలు ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. సరిగ్గా ఈ ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండ గానే.. ఇది చట్టబద్ధంగా లేదంటూ హవాయ్‌ జడ్జి వాట్సన్‌ నిషేధాన్ని నిలిపివేశారు. ఈ నిషేధం అమల్లోకి వస్తే ‘కోలుకోలేని గాయం’ తగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులు అమల్లోకి వస్తే మత సమానత్వం, స్వేచ్ఛను కాపాడే ‘ఎస్టాబ్లిష్‌మెంట్‌ క్లాస్‌’ను ఉల్లంఘించినట్టే అవుతుందన్నారు. మేరీల్యాండ్‌ కోర్టు కూడా ట్రంప్‌ నూతన వలసల నిషేధ ఉత్తర్వుల్లోని కొన్నింటిపై స్టే విధించింది.  

తీర్పును స్వాగతించిన పలు గ్రూపులు
ఈ తీర్పును ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ, పలు రైట్‌ గ్రూపులు, ఇండియన్‌– అమెరికన్‌ గ్రూపులు స్వాగతించాయి. హవాయ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ మహిళ తుల్సీ గబ్బర్డ్‌ వలస నిషేధం అనేది చెడు విధానమని వ్యాఖ్యానించారు. జాతి వివక్షకు పాల్పడే వారు ఎవరైనా చివరకు అధ్యక్షు డైనా ఒప్పుకోమన్నది ఈ తీర్పు సారాం శమని సౌత్‌ ఏసియన్‌ అమెరికన్స్‌ లీడింగ్‌ టుగెదర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుమన్‌ రఘునందన్‌ అభివర్ణించారు. ముస్లింలను దేశంలోకి ప్రవేశించనీయకుండా చేయడం తప్పని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు.

సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తాం: ట్రంప్‌
కోర్టు ఆదేశాలను ట్రంప్‌ తప్పుపట్టారు. న్యాయ వ్యవస్థ అతిగా ప్రవర్తిస్తోం దంటూ  ట్వీట్‌ చేశారు. ఈ తీర్పు మమ్మల్ని బలహీనపరిచే విధంగా ఉందని.. దీనిపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని తెలిపారు. ‘రాజకీయ కారణాలతో జడ్జి ఇదంతా చేస్తున్నారని మీరు అనుకోవద్దు’అంటూ ట్రంప్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ తొలి బడ్జెట్‌ విదేశీ సాయానికి కోత
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన తొలి బడ్జెట్‌లో విదేశీ సాయానికి ఏకంగా 28 శాతం కోత పెట్టనున్నారు. అమెరికా సాయంతో ఎక్కువగా లబ్ధిపొందుతున్న పాకిస్తాన్‌ వంటి దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్‌ డాలర్లను విదేశీ సాయంగా అందించాలని యూఎస్‌ భావి స్తోంది. ఇందులో ఆర్థికాభివృద్ధికి 60%, భద్రత కోసం 40% వెచ్చించనున్నట్లు మీడియా పేర్కొంది.

9/11 ఘటన తర్వాత అమెరికా నుంచి అధిక సాయం పొందిన దేశాల్లో అఫ్గానిస్తాన్‌ (4.7 బిలియన్‌ డాలర్లు), ఇజ్రాయెల్‌ (3.1 బిలియన్‌ డాలర్లు), ఈజిప్ట్‌ (1.4 బిలియన్‌ డాలర్లు), ఇరాక్‌ (1.1 బిలియన్‌ డాలర్లు), జోర్డాన్‌ (1 బిలియన్‌ డాలర్లు), పాకిస్తాన్‌ (742 మిలియన్‌ డాలర్లు) ఉన్నాయి. విదేశాలకు సాయాన్ని తగ్గించి, స్వదేశానికి మరింత మొత్తం వెచ్చిస్తామన్న ట్రంప్‌ హామీ మేరకు బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు చేశారు. ప్రతిపాదనలతో కూడిన ‘బడ్జెట్‌ బ్లూప్రింట్‌’ను వైట్‌హౌస్‌ గురువారం విడుదల చేసింది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను మేలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ మొత్తం విలువ లక్షా పదివేల కోట్ల డాలర్లు. రక్షణ శాఖకు కేటాయింపులను ట్రంప్‌ 54 బిలియన్‌ డాలర్లు పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement