శరణార్థులపై ట్రంప్ మరో పిడుగు
► వీసాల జారీపై అగ్రరాజ్యం ఆంక్షలు
► రక్తసంబంధీకులు అమెరికాలో ఉంటేనే వీసా
► 6 దేశాల పౌరులకు మరిన్ని కష్టాలు
వాషింగ్టన్: ఉగ్రవాద బాధిత దేశాల నుంచి అమెరికా వచ్చే శరణార్థులపై తాత్కాలిక నిషేధానికి (ట్రావెల్ బ్యాన్) అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పిన అనంతరం అగ్రరాజ్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు ముస్లిం దేశాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా నిబంధనలు తీసుకొచ్చారు. అమెరికాలోని వ్యాపారాలు లేదా కుటుంబాలతో సంబంధం ఉన్న శరణార్థులందర్ని, ముఖ్యంగా ఆరు ముస్లిం దేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు ట్రంప్ కార్యాలయం బుధవారం పేర్కొంది.
కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటికే జారీచేసిన వీసాలు యథాతథంగా కొనసాగుతాయి. అయితే ఉగ్రవాదం అధికంగా ఉన్న సిరియా, సుడాన్, సోమాలియా, లిబియా, ఇరాన్, యెమెన్ దేశాల నుంచి వీసాలకు దరఖాస్తు చేసుకునేవారికి మాత్రం ఆంక్షలు ఉంటాయి. ఇప్పటికే వారికి అమెరికాలో తల్లిదండ్రులు, పిల్లలు, భాగస్వామి, అల్లుడు, కోడలు, తోబుట్టువులు ఉన్నారని నిరూపించుకుంటేనే వీసా జారీ చేస్తారు. అంతేగాక అన్ని దేశాల శరణార్థులకు ఇవి వర్తిస్తాయని, కొన్ని సడలింపులతో వీటిని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. తాతలు, మునిమనవళ్లు, కాబోయే భర్తలు, అత్త, మామ, కజిన్స్ వంటి ఇతర కుటుంబ సభ్యుల విషయంలో సన్నిహిత సంబంధాలను పరిగణనలోకి తీసుకోమని హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాలోని అన్ని శాఖలకు వీటిని పంపించారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారస్తులు/నిపుణులకు అమెరికాతో సంబంధాలున్నాయని, వాటన్నింటిన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు హోంశాఖ పేర్కొంది. జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు తగిన ఆహ్వానంతో వస్తే వీసా ఇస్తారు. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ ఉన్నవారిని కూడా ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తారు. ఆరు ముస్లిం దేశాల శరణార్థుల రాకపై నిషేధం విధిస్తూ గతంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయం కోర్టుల వరకు వెళ్లింది. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై కింది కోర్టులు అభ్యంతరం చెప్పగా, సుప్రీంకోర్టు మాత్రం ఆమోదం తెలిపింది.
హెచ్1బీ వీసాదారుల జీతాలు పెంచండి
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై అమెరికా వచ్చిన ఐటీ నిపుణుల కనీస వేతనాలను 60 వేల నుంచి 80 (దాదాపు 3.88 లక్షలు) వేల డాలర్లకు పెంచాలని ఈ దేశ కార్మికశాఖ కార్యదర్శి అలెగ్జాండర్ అకోస్టా భారత ఐటీ కంపెనీలకు సూచించారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్1బీ వీసాదారులను నియమించడాన్ని అడ్డుకుంటామని ఆయన పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. కనీస వేతనాలను పెంచి ఉంటే సమస్య చాలా వరకు పరిష్కారమయ్యేదని అన్నారు. ఈ విషయంలో పార్లమెంటు చొరవ తీసుకోవాలని అకోస్టా కోరారు. ఈ విషయమై ఆయన ఒక ఉదాహరణ చెబుతూ షికాగో కేంద్రంగా నడిచే ఫార్మా కంపెనీ 150 మంది స్వదేశీ ఉద్యోగులను తొలగించి, హెచ్1బీ వీసాదారులను నియమించుకుందన్నారు. కొత్త ఉద్యోగులకు కూడా పాతవాళ్లే శిక్షణ ఇచ్చారని విమర్శించారు.