కొలంబియా విలయం: 254కు పెరిగిన మృతులు
మొకోవా: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదతోపాటు ముంచెత్తిన బురద విలయానికి దక్షిణ అమెరికా దేశం కొలంబియా విలవిలలాడుతోంది. దేశ నైరుతి ప్రాంతంలోని మొకోవా నగరం మొత్తాన్ని బురద ప్రవాహం ముంచెత్తింది.
దీంతో అనేక ఇళ్లు, వంతెనలు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. ఎక్కడచూసినా బురద తప్ప మరేమీ కనిపించని పరిస్థితి నెలకొంది. విలయం కారణంగా చనిపోయినవారి సంఖ్య సోమవారం నాటికి 254కు పెరిగింది. దేశాధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ మొకోవాలోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
(బురద విలయం ఫొటోలు ఇక్కడ క్లిక్ చేయండి)
గత శుక్రవారం భారీ వర్షం కురవడంతో మొకోవా, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహించిన కారణంగానే మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, చివరికి మహా విపత్తుకు దారితీసింది. ఈ విషాదం నేపథ్యంలో దాదాపు 200 మంది గల్లంతుకాగా, 300 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. అనేక ఆవాసాలు ధ్వంసమయ్యాయి. స్థానిక అధికారులు, సైనిక సిబ్బంది, పోలీసులతో కూడిన విపత్తు బృందాలు గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టాయి. గడిచిన మూడు రోజులుగా మొకోవాలో, పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు దొరకకపోవడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.