ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు సహా నలుగురి మృతి
మల్కన్‌గిరి/సీలేరు (విశాఖ జిల్లా): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు బుధవారం భద్రతా బలగాలపై మెరుపు దాడికి తెగబడ్డారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఏరియాలోని సరుకుబంద అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చి, కాల్పులు జరిపారు. ఎస్సార్ పైపులైన్ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు వెళ్లిన జవాన్లు ఉదయం 7 గంటలకు తిరిగి వస్తుండగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు జవాన్లు సహా నలుగురు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు.
మృతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఎస్‌ఐ రాసాని సిద్ధయ్య(47), హెడ్‌కానిస్టేబుళ్లు ఎం.రవిచంద్ర, అవినాశ్, గుంటవాడ కాట్మన్ గూడేనికి చెందిన గిరిజన వ్యవసాయ కూలీ కిల్లో హరిగా గుర్తించారు. దాడి సమయంలో పక్కనే పొలం పనులు చేసుకుంటున్న హరి పేలుడు ప్రభావంతో చనిపోయాడు. దాడిలో జవాన్లు అశోక్‌కుమార్, డి.కుయ్మర్, డి.కె.రావు, ఎం.లాల, డి.అక, ఎస్.చంద్ర గాయపడ్డారు. అశోక్ కుమార్‌కు కన్నుపోయింది. క్షతగాత్రులను మల్కన్‌గరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కిల్లో హరి కుటుంబానికి సీఎం నవీన్ పట్నాయక్ రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నక్సల్స్ దాడిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఖండించారు.
మృతుల్లో ఏపీ వాసి
ఈ ఎన్‌కౌంటర్‌లో చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కురవపల్లెకు చెందిన బీఎస్‌ఎఫ్ జవాను రాసాని సిద్దయ్య అమరుడ య్యారు. ఆయన వీరయ్య, తిమ్మక్కల కుమారుడు. డిగ్రీ వరకు చదువుకున్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు పాటు దేశ సరిహద్దుల్లోనూ పనిచేశారు. ప్రస్తుతం జాన్‌బై ఔట్‌పోస్టు పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
ఏఓబీలో నక్సల్స్ దాడి
Published Thu, Aug 27 2015 1:07 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement