సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్-3కు విరుద్ధంగా ఉందని, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేంద్రాన్ని నిలువరించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మరో నాలుగు పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్లంటినీ విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం అనుమతించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది సతీష్ గల్లా మీడియాకు వెల్లడించారు. విశాలాంధ్ర మహాసభ, రఘురామకృష్ణరాజు, అడుసుమిల్లి జయప్రకాశ్‌లు వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేయగా.. గతంలో చిరంజీవిరెడ్డి, సి.ఎం.రమేష్ తదితరులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇవన్నీ వచ్చే శుక్రవారం విచారణకు రానున్నట్టు సతీష్ తెలిపారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా బిల్లును తిరస్కరించినా కేంద్రం బిల్లును ప్రవేశపెడుతోందని, అందువల్ల ఈ ప్రక్రియలో జోక్యం చేసుకుని బిల్లును ఆపాలని విజ్ఞప్తి చేసినట్టు ఆయన వెల్లడించారు. బిల్లు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా, అసమగ్రంగా ఉందని, అసెంబ్లీ అభిప్రాయం పూర్తిగా తెలుసుకోకుండానే పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.