4 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిండికేట్ బ్యాంక్ ఈడీ ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ ఆఖరు నాటికి ఇది రూ. 3.52 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడున్న 3,145 శాఖల సంఖ్యను 3,250కి పెంచుకోనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనూ ప్రస్తుతం 462 శాఖలు ఉండగా.. మార్చి ఆఖరు నాటికి 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మంగళవారం ఇక్కడ విలేకరులతో ఆంజనేయ ప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్ వ్యాపారం సుమారు రూ. 32,500 కోట్లుగా ఉందని, ఇది రూ.34,000 కోట్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే వెల్లడించిన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రస్తావిస్తూ.. బ్యాంకింగ్ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తాము మెరుగైన పనితీరునే సాధించ గలిగామని ఆంజనేయ ప్రసాద్ చెప్పారు. కొత్త శాఖల ద్వారా కరెంటుసేవింగ్స్ అకౌంట్లు ఖాతాలను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లుతెలిపారు. తద్వారా ప్రస్తుతం 30.82 శాతంగా ఉన్న కాసా నిష్పత్తిని .. 31శాతానికి పెంచుకోగలమని ఆయన చెప్పారు.
మొండి బకాయిల కట్టడిపై దృష్టి..
డిసెంబర్ క్వార్టర్‌లో కొత్తగా ఎల్‌ఐసీ పాలసీలు విక్రయించడం ద్వారా రూ. 3 కోట్ల పైగా కమీషన్ లభించిందన్నారు. ఇక, మొండి బకాయిలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అయితే వీటి కట్టడి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
నిధుల సమీకరణ..
ప్రభుత్వం ఇప్పటికే రూ. 200 కోట్ల మేర మూలధనం సమకూర్చిందని.. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (కిప్) ఇష్యూ ద్వారా మరో రూ. 200 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం ఉందని ఆంజనేయ ప్రసాద్ చెప్పారు.
సిండ్ దిశ డిపాజిట్ పథకం..
కొత్తగా సిండ్ దిశ పేరుతో ఈ నెల 6 నుంచి డిపాజిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. 444 రోజుల వ్యవధికి గాను 9.25 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్స్‌కి 9.75 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పరిమిత కాల డిపాజిట్ పథకం కింద సుమారు నెల రోజుల వ్యవధిలో రూ. 10,000 కోట్ల దాకా సమీకరించాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. గరిష్టంగా రూ. 10 కోట్ల దాకా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఆంధ్రప్రదేశ్) పి. రాజారెడ్డి పేర్కొన్నారు.