
ఢిల్లీలో విదేశీ వనితపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ : మరోసారి దేశ రాజధానిలో అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈసారి ఏకంగా విదేశీ మహిళపైనే లైంగికదాడి జరిగింది. మన దేశ పరువును తీసింది. భారత్ చూసేందుకు వచ్చిన 51ఏళ్ల డానిష్ మహిళపై కొందరు ఆకతాయిలు మంగళవారం రాత్రి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తనను రేప్ చేశారని, ఆ తర్వాత డబ్బులు, ఇతర విలువైన వస్తువులు లాగేసుకున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.
బాధితురాలు వారం క్రితం ఇండియాకు వచ్చింది. న్యూఢిల్లీలోని హోటల్ అమాక్స్‌లో దిగిన ఆమె, ఆగ్రాతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాలను చూసొచ్చింది. నేషనల్ మ్యూజియంకు వెళ్లి హోటల్‌కు తిరిగొస్తుండగా దారి తప్పిపోయింది. రైల్వేస్టేషన్‌లో కొంతమందిని అడ్రస్ అడుగుతుండగా ... కామాంధుల చేతిలో చిక్కింది.
ఈ ఘటనపై ఆమె పోలీసులకు, డానిష్ ఎంబసీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై 376 జీ (2) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా బాధితురాలు బుధవారం ఉదయం కోపెన్ హెగెన్ తిరిగి వెళ్లిపోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆమె వైద్య పరీక్షలకు నిరాకరించినట్లు తెలిపారు.
కాగా వారం క్రితం ఇదే ప్రాంతంలో ఓ బాలిక కూడా ..... తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అనంతరం ఆమె తనపై అత్యాచారం జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్నికోణాల్లో ఈ కేసులో విచారణ జరుపుతున్నారు.