పట్నా: బిహార్లో మరోసారి మిడ్ డే మీల్స్ కలకలం రేపింది. మధ్యాహ్నభోజనం వికటించి 54మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఔరంగాబాద్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గిర్సింధీ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలతో బాధపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నబీ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా భోజనంలో బల్లి వచ్చినట్లు పలువురు విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు స్కూల్లోని ఆహార పదార్థాలను సేకరించిన పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. కాగా 2013లోనూ శరణ్ జిల్లాలో మిడ్ డే మీల్స్ వికటించి 23మంది విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 72వేల పాఠశాలల్లో ఈ మిడ్ డే మీల్స్ పథకం అమలు అవుతోంది. సుమారు 1.6 కోట్ల మంది విద్యార్థులకు రోజూ భోజనం పెడుతున్నారు.