మందుల కొనుగోలులో ట్రెండ్ మారింది
న్యూఢిల్లీ : ఔషధాల కొనుగోలులో కన్సూమర్ ట్రెండ్ మారింది. దాదాపు 61శాతం మంది ప్రజలు, ఆన్ లైన్ లోనే మెడిసిన్లను కొనుగోలు చేస్తున్నారట. కన్సూమర్ ఆన్ లైన్ ఫౌండేషన్ అండ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ బ్రీఫ్( బ్యూరో ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇండస్ట్రి అండ్ ఎకనామిక్ ఫండమెంటల్స్ ) చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్ లైన్ మందుల అమ్మక విధానంపై రిటైల్ మందుల దుకాణ యజమానులు కెమిస్ట్ లు నిరసనలు చేపట్టినా.. ఈ అమ్మకాలు పెరిగాయని సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ఎనిమిదన్నర లక్షల మంది కెమిస్టులు ఆన్ లైన్ లో మందులు విక్రయించడం అక్రమమని ఆరోపిస్తూ నిరవధిక బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే.
50 శాతం మంది వినియోగదారులు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను కొంటున్నారని, 36 శాతం మంది వినియోగదారులు ఎలాంటి బిల్లులు స్వీకరించడం లేదని సర్వే గణాంకాలు తెలిపాయి. ఆన్ లైన్ లో మందుల అమ్మకాలపై కేంద్రప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం లేదని, కానీ ఆఫ్ లైన్ లో మాత్రం నిబంధనలు కఠినంగా చేపడుతుందని ఫౌండేషన్ సంస్థ పేర్కొంది. ప్రాచీనమైన డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 కు రీప్లేస్ గా కొత్త చట్టం తీసుకురావాలని, ఆ చట్టం పేషెంట్ల సురక్షితం, నాణ్యమైన హెల్త్ కేర్ కు సంబంధించి ఉండాలని కన్సూమర్ ఆన్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బేజోన్ మిశ్రా అన్నారు.
అన్ని చానెల్స్ లో కూడా సురక్షితమైన మందుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిశ్రా సూచించారు. ఈ విషయంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖను, ఇతర డిపార్ట్ మెంట్లను ఫౌండేషన్ ఆశ్రయిస్తుందని మిశ్రా చెప్పారు. ఆన్ లైన్ లో అమ్మకాల వల్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు పెరిగిపోతాయని, నిషేధిత మందులు కూడా జోరుగా అమ్మకాలు జరిగే ప్రమాదముందని మందుల దుకాణదారులు ముందు నుంచి ఆరోపిస్తున్నారు.