
638 సార్లు చంపాలనుకున్నారు..
హవానా: అమెరికా తనకు ఆగర్భ శత్రువైన క్యూబా మాజీ అధ్యక్షుడు, వీర విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రోను చంపేందుకు చేయని ప్రయత్నం లేదు. 600 సార్లుకుపైగా ప్రయత్నించి విఫలమైనట్లు చరిత్ర తెలియజేస్తోంది. జేమ్స్‌బాండ్ సినిమాల్లోలాగా సిగార్లలో విషం నింపడం ద్వారా, పెన్ను సిరాలోకి విషం ఎక్కించడం ద్వారా, అందమైన అమ్మాయిలతోని, మాజీ భార్యతోని విషపు గుళికలను తినిపించడం ద్వారా, సముద్ర నత్త గుళ్లల్లో శక్తివంతమైన చిన్న బాంబులను అమర్చడం ద్వారా, ప్రత్యేకమైన మాఫియా పద్ధతుల్లో క్యాస్ట్రోను చంపేందుకు అమెరికా సీఐఏ ప్రయత్నించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ అయితే క్యాస్ట్రోను హతమార్చేందుకు ‘ఆపరేషన్ మంగూస్’ పేరిట పెద్ద వ్యూహమే రచించారు.
అన్నీ హత్యా ప్రయత్నాల నుంచి జేమ్స్‌బాండ్‌కన్నా చాకచక్యంగా తప్పించుకున్న క్యాస్ట్రో ఓ సందర్భంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి ప్రయత్నాల నుంచి తప్పించుకున్నవారి మధ్య ఒలింపిక్స్ పోటీ పెట్టినట్లయితే కచ్చితంగా తనకు బంగారు పతకం వచ్చేదని వ్యాఖ్యానించారు. తనపై అమెరికా నీడ కూడా పడకుండా చివరి వరకు కమ్యూనిస్టు యోధుడుగా పోరాడిన కాస్ట్రో సహజసిద్ధంగా తన 90వ ఏట కన్నుమూశారు. క్యాస్ట్రోను చంపేందుకు 638 సార్లు అమెరికా సీఐఏ కుట్ర పన్నిందని ఆయన వెన్నంటే ఉండి అనేకసార్లు ఆయన్ని ఈ హత్యాప్రయత్నాల నుంచి రక్షించిన రిటైర్డ్ క్యూబా ఇంటెలిజెన్స్ అధికారి ఫాబియన్ ఎస్కలాంటే తెలిపారు.
క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లారెంజ్ ద్వారా విషపు గుళికలు ఇచ్చి చంపేందుకు సీఐఏ ప్రయత్నించడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. తాను గర్భవతి అయ్యేవరకు క్యాస్ట్రోతో కలసివున్న లారెంజ్ ఓ రోజు హఠాత్తుగా జబ్బున పడ్డారు. వైద్యం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఆమెను కలసుకున్న సీఐఏ అధికారులు, లారెంజ్‌కు ఆలస్యంగా ఆబార్షన్ చేయించి ప్రాణం మీదకు తీసుకురావాలని క్యాస్ట్రో కుట్రపన్నినట్లు ఆమెను నమ్మించారు. ప్రతిగా అమెరికా ప్రజల కోసం క్యాస్ట్రోను భోజనంలో విషపు మాత్రలు కలిపి చంపేయాలని సూచించారు. ప్రమాదకరమైన విషపు గుళికను కూడా ఇచ్చి పంపారు. కస్టమ్స్ అధికారుల కళ్లుకప్పి కూడా ఆమెను క్యూబాకు పంపించారు.
అమెరికాలలో లారెంజ్‌ను సీఐఏ అధికారులు కలుసుకున్న విషయాన్ని తన వేగుల ద్వారా తెలసుకున్న క్యాస్ట్రో అతి జాగ్రత్తగా లారెంజ్ ప్రవర్తనను గమనిస్తూ వచ్చారు. అమె తన కోల్డ్ క్రీమ డబ్బాలో దాచిన విషపు మాత్రను క్యాస్ట్రో ఓ రోజు కనుక్కున్నారు. అప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి తన పిస్టల్ తీసి అమెకిచ్చి తనను చంపాలనుకుంటే నేరుగానే చంపాలని ఆమెకిచ్చారట. కళ్లు మూసుకొని సిగరెట్ పొగ వదులుతూ నుదిటిపై గురిచూసి కాల్చమని చెప్పారట. దానికి లారెంజ్ వనికిపోతూ పిస్టల్ నుంచి తుపాకీ గుళ్లను తీసేసి, పొరపాటుపడ్డాను, క్షమించడంటూ క్యాస్ట్రో కౌగిట్లో వాలిపోయారట. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని ప్రజల ముందు బహిర్గతం చేసింది. కారు యాక్సిడెంట్ల ద్వారా, క్యాస్ట్రో తరచుగా వెళ్లే బేస్‌బాల్ స్టేడియంలలో గ్రెనేడ్ల ద్వారా చంపేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారని ఎస్కలాంటే మీడియాకు అనేక సందర్భాల్లో వెల్లడించారు. 1990లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో క్యాస్ట్రో మాట్లాడేందుకు వచ్చినప్పుడు ఆయన బూట్లపై రసాయనిక పౌడర్ సిఐఏ చల్లిందట. బూట్లు ఇప్పుకోవడం, కట్టుకోవడం వల్ల ఆ పౌడర్ రియాక్షన్ ద్వారా ఆయన గడ్డం ఊడిపోవాలన్నది కుట్రట. ఎల్‌ఎస్‌డీ నింపిన సిగరెట్లు అందించడం ద్వారా కూడా చంపాలనుకున్నట్లు ‘ఏ 638 ప్లాట్స్ అగెనెస్ట్ క్యాస్ట్రో’ అనే పుస్తకంలో ఎస్కలాంటే వివరించారు. ఆయన ఆ పుస్తకంలో కుట్రలకు డాక్యుమెంట్ ఆధారాలు కూడా చూపించారు.