'విషాదం మరిచేలా వివాహ ఏర్పాట్లు'
శ్రీనగర్: కొన్ని సంఘటనలు కొందరి జీవితాల్లో అనూహ్య మలుపులు తిప్పుతాయి. కొందరికి గాయాలుగా మిగులుతాయి. కొందరికి మధుర జ్ఞాపకాలు అవుతాయి. అయితే ప్రతి విషాదాన్ని ఓ సంతోషకరమైన పనితో భర్తీ చేయొచ్చని అంటుంటారు. సరిగ్గా అదే పనికి పూనుకున్నాడు జమ్మూకాశ్మీర్కు చెందిన హిలాల్ అహ్మద్ అనే 25 ఏళ్ల యువకుడు. సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్ 7న అతడి జీవితంలో పెను విషాధమే సంభవించింది. మరోరోజులో పెళ్లి జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా వరదలు వచ్చి అతడి సర్వస్వం తుడిచిపెట్టుకుపోయింది. వారి ఇంటితో సహా వరదల్లో కొట్టుకుపోయింది.
పెళ్లిఆగిపోయింది. దీంతో అటు భౌతికంగా, మానసికంగా అతడు కుంగిపోయాడు. గత ఏడాది ఈ విషయాన్ని మీడియాకు చెప్పిన హిలాల్ ఇప్పుడేం చేస్తున్నాడా అని మీడియా వెతికి చూడగా.. వారికి ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ప్రస్తుతం రెండుగదుల చెక్కతో నిర్మించిన ఇంట్లో ఉంటున్న అతడు రేపు తన వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. శ్రీనగర్లోని చినార్బాగ్లో ఉంటున్నవారి కుటుంబం వారికి ఉన్నంతలో పెళ్లి పనుల్లో బిజీ అయ్యి కనిపించారు. ఈ సందర్భంగా వరదల గురించి చెబుతూ'నా జీవితంలోనే అలాంటి విధ్వంసం చూడలేదు. నేను సర్వస్వం కోల్పోయాను. ఎంతో కష్టపడి అదే ప్రదేశంలో చెక్కతో నివాసం ఏర్పాటుచేసుకున్నాను. అన్ని వస్తువులు తెచ్చుకున్నాను. ఇక ఆ విషాదం మరిచిపోయేలా అదే అమ్మాయితో ఇప్పుడు నా వివాహం చేసుకుంటున్నాను' అని చెప్పాడు.