అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
తండ్రిపైనే అనుమానం!
కట్నమివ్వాల్సి వస్తుందనే ఘాతుకం!
గొల్లపల్లి: కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం వెన్గుమట్లలో పాట్కూరి మౌనశ్రీ(23) అనుమానాస్పద స్థితిలో మరణించింది. గ్రామానికి చెందిన పాట్కూరి సత్యనారాయణరెడ్డి-ప్రేమలత దంపతులు 20 ఏళ్ల క్రితం విడిపోగా, వారికి కుమార్తె మౌనశ్రీ ఉంది. కాగా, తండ్రి సత్యనారాయణ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. పోషణకోసం ప్రేమలత కోర్టుకెక్కడంతో తల్లీకూతుళ్ల పోషణను సత్యనారాయణరెడ్డి చూడాలని, కూతురు వివాహం కూడా ఆయనే చేయాలని ఆదేశించింది. ప్రేమలత భర్తపై ఆధారపడకుండా కుమార్తెను చదివించింది. వెటర్నరీ డిప్లొమా పూర్తి చేసిన మౌనశ్రీ ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఆమె పెళ్లి బాధ్యత తనపై ఉండడంతో సత్యనారాయణరెడ్డి ప్రయత్నాలు మొదలెట్టాడు. వారం రోజుల క్రితం కరీంనగర్‌లో ఓ సంబంధం కుదిరింది. మాట్లాడేందుకు సత్యనారాయణరెడ్డి వెళ్లాడు. మంగళవారం మౌనశ్రీని వెన్గుమట్లకు రావాలని, వివాహం గురించి మాట్లాడదామని తన మిత్రుడితో సత్యనారాయణరెడ్డి ఫోన్ చేయించాడు.
తండ్రి పిలుపుతో మౌనశ్రీ వెన్గుమట్లకు వచ్చింది. భోజనం చేసి ఇంట్లోనే నిద్రించింది. తెల్లారేసరికి చనిపోయి ఉంది. తన కుమార్తెను కన్నతండ్రి, అతడి రెండోభార్య, ఆమె సోదరుడు కలిసి పథకం ప్రకారమే హతమార్చారంటూ ప్రేమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, మౌనశ్రీ వివాహానికి రూ.25 లక్షలు కట్నంగా కుదరగా, ఆ మేరకు ఇస్తానని హామీ ఇచ్చి.. అంత కట్నం ఇచ్చి వివాహం జరిపించాల్సి వస్తుందనే కోపంతోనే తన భర్త, అతడి రెండో భార్య, ఆమె సోదరుడు కలిసి తన కూతురును చంపారని తల్లి ప్రేమలత ఆరోపిస్తోంది.