మా ఎంపీల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు | Aam Aadmi Party alleges Centre 'snooping' on its MPs | Sakshi
Sakshi News home page

మా ఎంపీల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

Published Tue, Sep 8 2015 9:56 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

మా ఎంపీల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - Sakshi

మా ఎంపీల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

న్యూఢిల్లీ: తమ పార్టీ తరఫున పంజాబ్‌లో గెలచిన ఎంపీలు భగవంత్‌మన్, ధరంవీర్ గాంధీ టెలిఫోన్ సంభాషణలు లీక్ కావడంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం విమర్శలతో విరుచుకుపడింది. తమ ఎంపీల ఫోన్లను బీజేపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించింది. ఇందుకు భగవంత్‌మన్, ధరంవీర్ సంభాషణల టేప్ బహిర్గతం కావడమే ఉదాహరణ అని పేర్కొంది.

ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయాలని ఆప్ తమ ఎంపీలను కోరింది. టేపుల్లోని భగవంత్‌మన్ సంభాషణకు అంత ప్రాధాన్యం లేదని ఆప్ పేర్కొంది. ఆప్ అధికార ప్రతినిధి దీపక్ బాజ్‌పేయి మాట్లాడుతూ, ఇతర పార్టీల ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలివని విమర్శించారు. ఈ అంశంపై తప్పక విచారణ జరగాల్సిందేనన్నారు.

చీపురు గుర్తు వల్ల నేను గెలవలేదు..
పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున భగవంత్‌మన్, ధరంవీర్‌లు ఎంపీలుగా గెలిచారు. కాగా, సామాజిక మీడియాలో వీరి సంభాషణల టేప్ హల్‌చల్ చేస్తోంది. ఇందులో ధరంవీర్‌తో భగవంత్‌మన్ మాట్లాడుతూ ఆప్ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. చీపురు గుర్తు వల్ల తాను గెలవలేదని, ప్రజల్లో తనకు ఉన్న గుర్తింపు వల్లనే గెలిచానని భగవంత్‌మన్ అన్నారు. ఢిల్లీలో లాగా ఇక్కడి ప్రజలు గుర్తును చూసి ఓటేయలేదని, అభ్యర్థులను చూసి ఓట్లేశారని గాంధీతో వ్యాఖ్యానిస్తూ పార్టీపై తన అసంతృప్తిని మన్ వ్యక్తం చేశారు.

వీరిద్దరి ఈ సంభాషణ ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందురోజుదిగా తెలుస్తోంది. ఈ టేప్‌పై ధరంవీర్ స్పందిస్తూ ‘ మన్ వాదన సరైనదే. తను హృదయంలోని బాధను తెలియజేశాడు’ అని చెప్పారు. టేప్ బహిర్గతం కావడంలో తన పాత్రపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించాడు. తన ఫోన్‌కు సంభాషణలను రికార్డ్ చేసే సౌలభ్యం లేదని తెలిపారు.

చెత్త రాజకీయాలకు ఇదొక ఉదాహరణ: భగవంత్‌మన్
 కాగా, నెల రోజుల క్రితమే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ధరంవీర్‌ను ఆప్ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు భగవంత్‌మన్ స్పందిస్తూ కేజ్రీవాల్ నాయకత్వం మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీకి విధేయుణ్ని అని తెలిపారు. చెత్త రాజకీయాలకు ఇదొక ఉదాహరణ అని అన్నారు. పంజాబ్‌లో ఆప్‌ని ఎదగనీయకుండా చేసేందుకు ‘పంజాబ్ కనెక్ట్ ర్యాలీ’ తర్వాతి రోజే తమ సంభాషణల పేరుతో టేప్‌లు విడుదల చేశారని ఆరోపించారు. పార్టీలో ఏమైనా గ్రూప్ రాజకీయాలు నడుస్తుంటే.. వాటిపై పార్టీ అధినాయకత్వానికి చెప్పాలనే అంశంపై తాము మాట్లాడుకున్నామని ఆయన వివరణనిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement