'అభిమానులను అవమానించేలా హీరో కామెంట్స్'
న్యూఢిల్లీ: మత అసహనంపై ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆమిర్ ఖాన్ దేశం విడిచి వెళ్లిపోవాలని తాము కోరుకోవడం లేదని, ఇక్కడ ఆయన క్షేమంగా ఉన్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు ఆయన అభిమానులను అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరితంగా ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
కాగా తమ ప్రభుత్వ హాయంలో మతఘర్షణలు తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. గుడ్డిగా ప్రకటనలు చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజలను ఆమిర్ ఖాన్ భయాందోళనకు గురి చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి నళిని కోహ్లి ఆరోపించారు.
సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ... మత అసహనంపై తాను ఆందోళనకు గురయ్యానని ఆమిర్ ఖాన్ అన్నారు. 'ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?' అని తన భార్య కిరణ్ రావ్ అడిగిందని ఆమిర్ వెల్లడించారు.