
గబ్బర్‌సింగ్గే అహింస గురించి మాట్లాడినట్టు..
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసిందంటూ షుంగ్లు కమిటీ ఇచ్చిన నివేదికతో ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ నివేదికను అస్త్రంగా చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎం కేజ్రీవాల్‌పై విరుచుకుపడుతున్నాయి. కేజ్రీవాల్ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. కేజ్రీవాల్‌కు ఏమాత్రం అంతరాత్మ ఉన్నా.. వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.
అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను, షుంగ్లూ కమిటీ నివేదికను ఆప్ తోసిపుచ్చింది. కీలకమైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత తరుణంలో ఈ నివేదికను బయటపెట్టడంతోనే దీని వెనుక రాజకీయాలు అర్థమవుతున్నాయని పేర్కొంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రంగా మండిపడింది. 'కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే... (షోలే విలన్) గబ్బర్‌సింగ్ అహింస గురించి ఉపన్యాసం ఇచ్చినట్టు కనిపిస్తున్నది' అని ఆప్ నేత అశుతోష్ ఎద్దేవా చేశారు.
ముగ్గురు సభ్యులతో కూడిన షుంగ్లు కమిటీని పాత లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయం కోసం ఆప్‌కు భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కూతురిని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌గా నియమించడం, పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను సలహాదారులుగా వేసుకోవడం లాంటి నిర్ణయాలను ఈ కమిటీ తూర్పారబట్టింది.