పార్టీ నిధుల కోసం కేజ్రీవాల్ వేట!
బెంగళూరు: కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీని బ్రతికించుకోవాలంటే పెద్ద మొత్తంలో నిధుల అవసరం. ఏ పార్టీకైనా నిధుల కొరత ఏర్పడితే ఆ పార్టీ మనుగడే ప్రశ్నర్ధకరంగా మారుతుంది. పార్టీ పుట్టుకతోనే సంచలనాలు సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నిధుల సేకరణ పనిలో నిమగ్నమైయ్యారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్ ఈ వారాంతంలో బెంగళూర్ లో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే విందు కార్యక్రమంలో నిధుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులు, పార్టీ సభ్యుడు బాలకృష్ణన్ సమక్షంలో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు.
ఇప్పటికే కర్ణాటకలోని ఉన్న మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు ఆప్ ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్,బీజేపీ, జేడీఎస్ లతో పోటీ పడాలంటే పార్టీకి నిధుల ఆవశ్యం ఉందని భావించిన కేజ్రీవాల్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మార్చి 15వ తేదీన బెంగళూర్ లో పర్యటించే అవకాశాలున్నాయి.