సామాన్యుడి ‘కేక’ | AAP's landslide victory in Delhi decimates BJP and Congress | Sakshi
Sakshi News home page

సామాన్యుడి ‘కేక’

Published Wed, Feb 11 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

AAP's landslide victory in Delhi decimates BJP and Congress

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం
 70 స్థానాలకు గానూ 67 సీట్లలో గెలుపు
 బీజేపీకి ఊహించని పరాభవం; కేవలం 3 స్థానాల్లో విజయం
 ఖాతా తెరవని కాంగ్రెస్, ఇతర పార్టీలు
 ఫిబ్రవరి 14న సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
 అద్భుతం సృష్టించిన ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలు
 సత్యమార్గంలో వెళ్తే ప్రపంచం తోడుంటుందని వ్యాఖ్య
 కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ అభినందనలు; ఢిల్లీకి కేంద్ర సాయంపై హామీ


న్యూఢిల్లీ: రికార్డులు బద్దలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ తెల్లబోయాయి. రాజకీయ పండితులు నివ్వెరపోయారు. బీజేపీ చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఢిల్లీలో ‘సామాన్యుడు’ కదం తొక్కాడు. ఓట్ల సునామీ సృష్టించాడు. ప్రభంజనమై ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టాడు. మోదీ హవాను, అమిత్ షా చాణక్యాన్ని, బీజేపీ విజయ ప్రస్థానాన్ని అడ్డుకుని వారికి గర్వభంగం కలిగించాడు. ‘ఆమ్ ఆద్మీ’ సృష్టించిన ఓట్ల సునామీలో బీజేపీ, కాంగ్రెస్‌లు కొట్టుకుపోయాయి. మొత్తంమీద చీపురు పార్టీ ఢిల్లీని క్లీన్‌‘స్వీప్’ చేసి, కొత్త రాజకీయాలకు దారులు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను బీజేపీకి అందించిన ఢిల్లీ ప్రజలు.. సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించి గుణపాఠం చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం ఆవిష్కృతమైంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘన విజయం సాధించింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 67 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, ఎవరూ ఊహించని స్థాయిలో అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం మించిన ఈ ఫలితాలు ఆప్ ప్రభంజనానికి నిదర్శనంగా నిలిచాయి. మిగతా 3 స్థానాలను గెలుచుకున్న బీజేపీకి చావుతప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి ఏర్పడింది. ఊహించినట్లే కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.

1989లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం సంగ్రామ పరిషత్ పార్టీ మొత్తం 32 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించగా, ఆ తరువాత దాదాపు ఆ స్థాయి విజయం ఆప్‌కే సాధ్యమైంది. ఇది సామాన్యుడి గెలుపని, సత్యం సాధించిన విజయమని ఫలితాలు వెల్లడైన అనంతరం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ అద్భుతాన్ని చేసిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సత్యమార్గంలో ఉన్నవారికి విశ్వంలోని శక్తులన్నీ తోడుగా నిలుస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం మధ్యాహ్నం కేజ్రీవాల్‌కు ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన కేజ్రీవాల్.. తమకు కేంద్ర సహకారం అవసరమని, త్వరలో వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా ‘అరవింద్‌కు పూర్తి మార్కులు’ అంటూ కేజ్రీవాల్‌ను అభినందించారు.

సరిగ్గా ఏడాదికి..
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం సమావేశమైన ఆప్ నూతన ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా మూజు వాణి ఓటుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్ పేరును ఆయన సన్నిహిత నేత మనీశ్ సిసోడియా ప్రతిపాదించారు. ఈ గెలుపుతో గర్వపడొద్దని, అహంకారపూరిత వైఖరి వల్లనే కాంగ్రెస్, బీజేపీలు ఓడిపోయాయని పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా కేజ్రీవాల్ సూచించారు. అనంతరం మనీశ్ సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుపై తమ సంసిద్ధతను వ్యక్తపర్చారు.

2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. జనలోక్‌పాల్ బిల్లును బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకోవడంతో 49 రోజులకే 2014, ఫిబ్రవరి 14న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన సరిగ్గా సంవత్సరం తరువాత ఈ ఫిబ్రవరి 14న ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడం విశేషం. ఒంటిచేత్తో పార్టీని గెలిపించిన అరవింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో సమీప బీజేపీ ప్రత్యర్థి నుపుర్ శర్మపై 31,583 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియాకు డిపాజిట్ కూడా దక్కలేదు.

మట్టికరచిన హేమాహేమీలు
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం దెబ్బకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ సహా బీజేపీ, కాంగ్రెస్‌ల్లోని హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. అందులో చాలామందికి కనీసం ధరావత్తులు దక్కలేదు. ఆయా పార్టీల కంచుకోటల్లో సైతం ఆప్ విజయం సాధించింది. బీజేపీకి కంచుకోట కృష్ణానగర్ నుంచి పోటీ చేసిన కిరణ్‌బేడీ ఆప్ అభ్యర్థి ఎస్‌కే బగ్గా చేతిలో 2 వేల ఓట్ల పై చిలుకు తేడాతో చిత్తయ్యారు. కృష్ణానగర్ బీజేపీ సీనియర్ నేత హర్షవర్ధన్ సొంత నియోజకవర్గం కావడం గమనార్హం.

కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ అజయ్ మాకెన్ సదర్ బజార్ స్థానంలో రాజకీయ అనుభవం అస్సలు లేని ఆప్ అభ్యర్థి సోమ్‌దత్ చేతిలో 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాకెన్‌కు కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ(కాంగ్రెస్) కూడా గ్రేటర్ కైలాశ్ స్థానంలో ఓటమి పాలయ్యారు.

జగదీశ్ ముఖి, రామ్‌వీర్ సింఘ్ బిధూరి, కృష్ణ తీరథ్ తదితర బీజేపీ ప్రముఖులు.. ఏకే వాలియా, హరూన్ యూసుఫ్, చౌదరి ప్రేమ్‌సింగ్, రాజ్‌కుమార్ చౌహాన్, మహాబల్ మిశ్రా తదితర కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఢిల్లీశాఖ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా(రోహిణి), జగదీశ్ ప్రధాన్(ముస్తాఫాబాద్), ఓం ప్రకాశ్ గుప్తా(విశ్వాస్ నగర్) మాత్రమే విజయం సాధించారు. ఈ ఓటమి తమకు దెబ్బేనని అంగీకరించిన బీజేపీ నేతలు.. ఈ ఫలితాలు మోదీ పాలనకు రెఫరెండం మాత్రం కాదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయానంతరం జరిగిన మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి, జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓట్లశాతం సాధించిన బీజేపీకి ఢిల్లీ ఫలితాలు ఒక గుణపాఠమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధానిని ఆహ్వానిస్తాం: ఆప్
శనివారం సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆప్ తెలిపింది. అలాగే ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై చర్చించేందుకు బుధవారం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరామని, అటువైపు నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని ఆప్ అధికార ప్రతినిధి ఆశిష్ ఖైతాన్ తెలిపారు.

గర్వం తలకెక్కొద్దు..
ఫలితాలు వెలువడటం ప్రారంభమైనప్పటి నుంచీ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు సంబరాలు చేసుకుంటున్న ఆప్ కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విజయాన్ని నెత్తికెక్కించుకుని అహంకారం ప్రదర్శించవద్దని వారికి హితవు పలికారు. ‘అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రజలు మనల్ని శిక్షిస్తార’ని హెచ్చరించారు. ‘ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. మీరు అద్భుతం చేశారు. మనం సత్యమార్గంలో ఉంటే ప్రపంచంలోని శక్తులన్నీ మనకు తోడుగా నిలుస్తాయి’ అన్నారు. కాగా, బీజేపీ పరాజయంతో ఆ పార్టీపై ధ్వజమెత్తేందుకు ప్రత్యర్థులకు అవకాశం చిక్కింది. ఈ పరాజయం మోదీ ఓటమేనన్న అన్నాహజారే వ్యాఖ్యతో తాను ఏకీభవిస్తానని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ట్వీట్ చేశారు. మోదీ హవాను అవహేళన చేస్తూ.. ‘కెరటం కన్నా సునామీ పెద్దదని ఈ ఫలితాలు రుజువుచేశాయి. ఢిల్లీ గద్దెపైనున్న పెద్దలకు ఇదొక సందేశం’ అని పేర్కొన్నారు. బీజేపీ బుడగ పేలిపోయిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. అహంకారం, రాజకీయ కక్షసాధింపు ధోరణుల వల్లనే బీజేపీ ఓడిపోయిందని విమర్శించారు.

ఒక మఫ్లర్‌వాలా: అరవింద్ కేజ్రీవాల్
వయసు 46


సర్కారీ పదవిని వదిలి సామాన్యుడితో మమేకమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ వేదికగా చీపురు పట్టి రాజకీయాల దుమ్ము దులిపారు. తొలిసారే ఢిల్లీ పీఠమెక్కి సీఎంగా వీధుల్లో ధర్నాలు చేశారు. 49 రోజులకే గద్దెదిగి ‘ఏకే-49’గా విమర్శకులకు ఆయుధమయ్యారు. క్షమాపణ కోరుతూ మళ్లీ జనాల్లోకే వెళ్లారు. మరొక్క చాన్స్ ప్లీజ్ అని వేడుకున్నారు. అవినీతి, అక్ర మాలను కడిగేస్తానని భరోసా ఇచ్చారు. అదే ఊపుతో తాజా ఎన్నికలను ఊడ్చేసి ‘ఏకే-67’గా మారిపోయారు. సామాన్యుడు కాస్తా అసామాన్యుడయ్యారు.

ఒక సూట్‌వాలా: నరేంద్ర మోదీ
వయసు 64

అచ్చమైన హిందీతో స్వచ్ఛమైన హిందుస్థానీగా అందరినీ ఆకట్టుకున్నారు. అమెరికాలో మెరిశారు. ఒబామాను రప్పించారు. పది లక్షల సూటుతో ఆహార్యంలో అదరహో అనిపించారు. అలతి అలతి మాటలతో మెప్పించారు. పథకాల ఊసులతో మురిపించారు. హోరెత్తే కార్యక్రమాలతో ఆడంబరం చేశారు. కానీ ప్రజలకు మొహం మొత్తింది. ఈ ఆడంబరాలు ఇక చాలని భావించారు. వరుస విజయాలతో బీజేపీ దిగ్విజయంగా నిర్వహిస్తున్న అశ్వమేధయాగాన్ని హస్తినలో అడ్డుకున్నారు.

ఒక ఢిల్లీవాలా
సామాన్యుడు కాదు.. అసామాన్యుడు
కుళ్లు రాజకీయాలతో ఢిల్లీవాలా విసిగెత్తిపోయాడు. అవినీతిపై గర్జించాలని కలలుగన్నాడు. తన ఆకాంక్షలను నెరవేర్చే సర్కారు కోసం తపించాడు. రాజకీయాలను కడిగేసేందుకు చీపురుతో వీధుల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకున్నాడు. పూటకో మాట మార్చే నాయకులను పక్కనబెట్టి నిజాయతీకే పట్టంకట్టాడు. హంగు, ఆర్భాటాలను కట్టిపెట్టాలంటూ బీజేపీకి దిమ్మదిరిగే తీర్పునిచ్చాడు. తనపై ఉంచిన బాధ్యతలను మధ్యలోనే వదిలినందుకు సారీ చెప్పిన కేజ్రీవాల్‌ను క్షమించాడు.‘సామాన్యుడికి కావాల్సింది ఇస్తా’నన్న అసామాన్యుడికే ఢిల్లీ పీఠాన్ని మళ్లీ అప్పగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement