నటి మృతి కేసులో యువ హీరో అరెస్ట్
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు విక్రమ్ చటర్జీని పోలీసులు శుక్రవారం ఉదయం కోల్‌కతాలో అరెస్ట్ చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ చౌహన్ మృతి కేసుకు సంబంధించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతి వేగంతో పాటు నిర్లక్ష్యంగా కారు నడిపి సోనికా సింగ్ మృతికి విక్రమ్ చటర్జీ కారణం అంటూ అతడిపై పోలీసులు 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిపై నమోదు అయిన అభియోగాలు నిరూపణ అయితే కనీసం రెండేళ్ల నుంచి 10ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ 29న సోనికా సింగ్ చౌహాన్, విక్రమ్ చటర్జీ... ఓ పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకు వెళ్లి, అనంతరం పల్టీలు కొడుతూ వెళ్లి రోడ్డు పక్కనే వున్న ఓ దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో సోనికా అక్కడికక్కడే మృతి చెందగా, విక్రమ్ గాయపడ్డాడు. ఆ సమయంలో విక్రమ్ వాహనాన్ని నడుపుతున్నాడు. మద్యం సేవించి అతడు డ్రైవింగ్ చేసినట్టు తమ దర్యాప్తులో తేలడంతో అతడిపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే తాను తాగి కారు నడపలేదని విక్రమ్ తొలుత చెప్పినప్పటికీ.. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ద ఈ కేసుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పార్టీలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ మద్యం సేవిస్తూ తమ మిత్రులకు షేర్ చేసిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ప్రమాద సమయంలో కారు అతివేగంగా నడిపినట్లు నిరూపితమైందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ కేసు నుంచి విక్రమ్ చటర్జీని తప్పించేందుకు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.